Site icon NTV Telugu

Hindu Beliefs: గర్భిణులు జాగ్రత్త.. చంద్రగ్రహణం రోజున ఈ తప్పులు చేయకండి

Pregnant Women Lunar Eclips

Pregnant Women Lunar Eclips

Hindu Beliefs: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే అరుదైన ఘటన చంద్రగ్రహణం. ఈ ఆదివారం 2025 సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఏర్పడబోతోనే విషయం తెలిసిందే. చంద్ర గ్రహణానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సైన్స్‌ పరంగా సూర్యుడు, చంద్రుల మధ్య భూమి అడ్డుగా వెళ్లినప్పుడు చంద్రుడి వెలుగును అడ్డుకుంటుందని, అదే చంద్ర గ్రహణం అని చెబుతారు. ఇక్కడ హిందు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. గర్భిణులు ఈ చంద్ర గ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాలని, గ్రహణం తల్లి, బిడ్డ ఇద్దరినీ ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నాయి. ఈ గ్రహణం రోజున గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హిందూ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, గర్భిణులు చేయకూడని పనులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల.. ఆ ముగ్గురికి బెయిల్!

కొన్ని తరాలుగా ప్రత్యేక పద్ధతులు..
హిందూ శాస్త్రాల్లో చంద్రుడిని మాతృత్వం, సంతానోత్పత్తికి సంబంధించినదిగా పేర్కొన్నారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి శక్తిలో వచ్చే మార్పుల కారణంగా గర్భిణులు, పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని హిందువులు భావిస్తారు. ఈ సమయంలో తల్లీబిడ్డలను రక్షించుకోవడానికి కొన్ని తరాలుగా ప్రత్యేక పద్ధతులు, ఆచారాలు పాటిస్తున్నారు. గర్భిణులు గ్రహణం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని హిందూ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో కాస్మిక్‌ ఎనర్జీస్‌ బలంగా ఉంటుందని, ఇంట్లోనే ఉండటం వల్ల వీటి నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని హిందువుల నమ్మకం. గర్భిణులు గ్రహణం ప్రారంభమయ్యే ముందే ఇంట్లో వండిన భోజనం తినాలని, ముగిసే వరకు తినకూడదని చెబుతారు. గ్రహణానికి ముందు లేదా గ్రహణం సమయంలో తయారుచేసిన ఆహారాన్ని హిందూ సంప్రదాయంలో కలుషితమైన ఆహారంగా భావిస్తారు. గ్రహణం సమయంలో గర్భిణులు కేవలం విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు.

స్నానం చేసి.. గంగా జలం చల్లుకోవాలి
గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణులు స్నానం చేయాలని, అలా చేయని పక్షంలో గంగా జలం (పవిత్ర జలం) అయినా చల్లుకోవాలని హిందూ శాస్త్రాలు సూచిస్తున్నాయి. గ్రహణం సమయంలో గర్భిణులు కత్తులు, కత్తెరలు లేదా సేఫ్టీ పిన్స్ వంటి పదునైన వస్తువులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని చెబుతున్నాయి. వీటి కారణంగా ప్రమాదవశాత్తు తల్లి లేదా బిడ్డకు హాని జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. గ్రహణం సమయంలో నీటిలో ఉంచిన కొబ్బరికాయను గర్భిణులు తమ ఒడిలో పెట్టుకోవాలని, ఇది పుట్టబోయే బిడ్డను ఏదైనా ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుతుందని హిందువులు విశ్వసిస్తారు.

విశ్వంలో సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడని, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యడు చుట్టూ తిరుగుతుందని చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. నిజానికి సైన్స్ కూడా అదే చెబుతుంది. అలానే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరుగుతాడు. ఇలా మూడు తిరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఒకే వరుసలోకి వస్తాయి. ఆ టైంలో సూర్యుడు వెలుగు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుగా వస్తుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. దీన్నే శాస్త్ర భాషలో చంద్ర గ్రహణం అని చెబుతారు. ఇది ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపదని సైన్స్ చెబుతుంది. అనవసరమైన ఆచారాలు, పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదని, గర్భిణులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని, సాధారణ రోజుల్లానే ఉంచాలని సైన్స్ సూచిస్తోంది.

READ ALSO: Chandra Grahan: రేపే చంద్రగహణం.. ఈ రాశుల వాళ్లు జర జాగ్రత్త..

Exit mobile version