Potti Sriramulu’s Sacrifice: “శ్రీరాములు లాంటి మరో 11 మంది అనుచరులు గనుక నాకు ఉంటే, నేను ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకువస్తాను” అని మహాత్మా గాంధీ ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములుని ఉద్దేశించి అన్నారు. అయితే, తన శిష్యుడు అదే గాంధేయ ఆయుధమైన ‘ఆమరణ నిరాహార దీక్ష’ను ఉపయోగించి స్వతంత్ర భారతదేశ రాజకీయ పటాన్ని మార్చేస్తాడని బహుశా గాంధీజీ కూడా ఊహించి ఉండరు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన కొన్నేళ్లకే, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 1952 అక్టోబర్‌లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో (ఆ తర్వాత మద్రాస్ రాష్ట్రంలో) భాగంగా ఉండేది. అప్పటికి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరగలేదు. సుదీర్ఘంగా 58 రోజుల పాటు సాగిన ఈ దీక్షలో శ్రీరాములు తను కలలుగన్న ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూడకుండానే అమరుడయ్యారు. కానీ ఆయన త్యాగం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాది వేసింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లడఖ్ విద్యావేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో చేసిన 20 రోజుల నిరాహార దీక్ష ఉదంతం.. 74 ఏళ్ల క్రితం నాటి పొట్టి శ్రీరాములు చారిత్రాత్మక దీక్షను మరోసారి గుర్తుకు తెస్తోంది.
తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ శ్రీరాములు దీక్ష కంటే చాలా పాతది. బ్రిటిష్ కాలం నుంచే ‘ఆంధ్ర మహాసభ’ తెలుగువారి ప్రత్యేక గుర్తింపు కోసం, తమిళుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. హిందీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు కావడం, దానికి ఘనమైన విజయనగర సామ్రాజ్య సాహిత్య వారసత్వం ఉండటం దీనికి కారణం. నిజానికి 1920ల నుంచే కాంగ్రెస్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. కానీ దేశ విభజన తర్వాత పరిస్థితులు మారాయి. మత ఘర్షణలు, శరణార్థుల సమస్యలు, కాశ్మీర్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో భాష ఆధారంగా రాష్ట్రాలను విడదీస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భయపడ్డారు. నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన జేవీపీ (JVP) కమిటీ కూడా దేశ భద్రత, ఐక్యత ముఖ్యం కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నకర ధోరణులను ప్రోత్సహించకూడదని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటను పక్కన పెట్టింది.
సరైన సమయం వచ్చినప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేద్దామని నెహ్రూ పార్లమెంట్‌లో చెప్పినప్పటికీ, ఆ సరైన సమయం ఎప్పుడో ఎవరికీ తెలియకపోవడంతో ఆంధ్రులలో అసహనం పెరిగింది. ఈ తరుణంలోనే నెల్లూరుకు చెందిన శానిటరీ ఇంజనీర్ అయిన పొట్టి శ్రీరాములు ఉద్యమ సారథిగా మారారు. 1928లో భార్య, అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన వ్యక్తిగత విషాదం తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో చేరారు. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. ప్రారంభంలో ఆయన దళిత సంక్షేమం, హరిజనుల ఆలయ ప్రవేశం వంటి సామాజిక అంశాలపై పోరాడారు. 1946లో మద్రాస్ ప్రావిన్స్‌లో దళితుల ఆలయ ప్రవేశం కోసం ఆయన ఆమరణ దీక్ష చేయగా, గాంధీజీ జోక్యంతో దాన్ని విరమించారు. అప్పుడు గాంధీజీ ఆయనను సాలిడ్ వర్కర్, కాస్త విచిత్రమైన వ్యక్తి (ఎక్సెంట్రిక్) అని అభివర్ణించారు.
1951 నాటికి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం రాజకీయంగా మరింత బలపడింది. స్వామి సీతారాం అనే కాంగ్రెస్ నేత ఐదు వారాల పాటు దీక్ష చేయగా, ఎన్నికల ప్రచారంలో నెహ్రూకు నల్లజెండాలు ఎదురయ్యాయి. 1952 ఎన్నికల్లో మద్రాస్ అసెంబ్లీలోని 145 తెలుగు సీట్లలో కాంగ్రెస్ కేవలం 43 మాత్రమే గెలవడం, విశాలాంధ్రను కోరుకునే కమ్యూనిస్టులు 41 సీట్లు సాధించడం కేంద్రానికి పెద్ద హెచ్చరికగా మారింది. అయితే అన్నింటికంటే పెద్ద వివాదం ‘మద్రాస్ నగరం’ (ప్రస్తుత చెన్నై) ఎవరికి చెందాలనే దానిపైనే నడిచింది. తమ జనాభా, సంస్కృతి, ఆర్థిక బలాన్ని బట్టి “మద్రాసు మనదే” అని ఆంధ్రులు డిమాండ్ చేయగా, ప్రధాని నెహ్రూ, మద్రాస్ ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 19, 1952న మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి నివాసంలో శ్రీరాములు తన చివరి ఆమరణ దీక్షను ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా నెహ్రూ మాత్రం చలించలేదు. “దీక్షల వల్ల అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు మార్చడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం” అని నెహ్రూ భావించారు. కానీ రోజురోజుకూ ప్రజా మద్దతు పెరగడం, రైళ్లను నిలిపివేస్తూ నిరసనలు ఉధృతం కావడంతో డిసెంబర్ 12న ఆంధ్ర రాష్ట్రాన్ని అంగీకరించక తప్పదని నెహ్రూ రాజగోపాలాచారికి లేఖ రాశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
58వ రోజు నాటికి శ్రీరాములు పరిస్థితి విషమించింది. కళ్లు లోతుకుపోయి, చర్మం రంగుమారి, గొంతు వాచిపోయి నీళ్లు కూడా మింగలేని స్థితికి చేరారు. రక్తం వాంతులు చేసుకుంటున్నా, దీక్ష ఆపమని డాక్టర్లు సైగ చేయగా పెదవులపై వేలు వేసి నిరాకరించారు. డిసెంబర్ 15, 1952న 51 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపులో మద్రాసు వీధులన్నీ శోకసముద్రమయ్యాయి. శ్రీరాములు మరణవార్త తెలియగానే తెలుగు జిల్లాల్లో దావాగ్ని రగిలింది. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి, రైల్వే ఆస్తులు తగులబడ్డాయి, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పోలీసుల కాల్పుల్లో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ తీవ్రమైన హింసాత్మక పరిస్థితులు నెహ్రూను పునరాలోచనలో పడేశాయి. శ్రీరాములు మరణించిన నాలుగు రోజులకే, అంటే డిసెంబర్ 19న మద్రాస్ నగరం లేకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును నెహ్రూ ప్రకటించారు. అలా అక్టోబర్ 1, 1953న కర్నూలు రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పడింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు, అంటే 1956 నవంబర్‌లో హైదరాబాద్ స్టేట్‌లోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం ఇందులో విలీనమై ‘ఆంధ్రప్రదేశ్’గా రూపాంతరం చెందింది. పొట్టి శ్రీరాములు త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకే పరిమితం కాలేదు, మొత్తం భారతదేశ రాజకీయ భూగోళాన్నే మార్చేసింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోనూ ఇలాంటి డిమాండ్లు ఊపందుకున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC)’ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి, లక్షలాది వినతులను స్వీకరించి 1956లో దేశంలోని రాష్ట్రాల సరిహద్దులను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించింది. మొదట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందేమో అని భయపడిన భాషా ప్రయుక్త విభజన, కాలక్రమేణా ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే భారతీయత అనే బంధాన్ని మరింత బలోపేతం చేసింది. అందుకే చరిత్రకారుడు రామచంద్ర గుహ తన పుస్తకంలో “జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారతదేశ నిర్మాత అయితే, పొట్టి శ్రీరాములు దానికి సరైన సరిహద్దు రేఖలు గీసిన భౌగోళిక రూపశిల్పి (మెర్కేటర్)” అని కొనియాడారు.

