Site icon NTV Telugu

హరనాథ్ వారసుడి ‘సీతామనోహర శ్రీరాఘవ’ ఆరంభం

Seeta Manohara Sri Raghava launched formally with Pooja Ceremony

వెండితెరపై మరో నట వారసుడి ప్రయాణం మొదలైంది. తపూ విరాట్ రాజ్. అలనాటి హీరో హరనాథ్ సోదరుని మనవడే ఈ విరాట్ రాజ్. తను హీరోగా రూపొందుతున్న’సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. ఆకాష్ పూరి తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. ఇక నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించారు. తాత వెంకట సుబ్బరాజు, పెద తాత హరనాథ్ స్ఫూర్తి తో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని, మీడియా, పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకుల ఆశీస్సులు అందించాలని కోరుకున్నాడు విరాట్ రాజ్.

Read Also : పవన్ షాకింగ్ డెసిషన్… సినీ ప్రియులకు మరోసారి నిరాశ

అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియో అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం ద్వారా దుర్గా శ్రీ వత్సస.కె. దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమ సినిమా టైటిల్ ‘సీతామనోహర శ్రీరాఘవ’ పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని… సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తామంటున్నాడు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్ కి సంగీతం అందిస్తున్న రవి బస్ రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఓ మంచి కథతో, నట వారుసునితో తమ వందన మూవీస్ సంస్థ పరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు నిర్మాత టి. సుధాకర్. ఇందులో కథానాయికగా రేవ నటిస్తోంది. ఇక ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి నటిస్తున్నారు.

Exit mobile version