Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!

India Vs Pakistan

India Vs Pakistan

పాకిస్థాన్ ఆకాశంలో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న కొన్ని విమానాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను గాల్లోనే వేలాడదీస్తున్నాయి. టర్కీకి చెందిన సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాల్లోకి వచ్చి వెళ్తున్నాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన C130 హర్క్యులిస్, A400m విమానాల కదలికలు కనిపించాయి. నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ లాంటి పాకిస్థాన్ సైనిక స్థావరాల్లో ఇవి దిగినట్టు ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారాన్ని పరిశీలించిన సంస్థలు చెబుతున్నాయి. అయితే విమానాలు వచ్చాయన్నది కనిపిస్తున్న నిజమే కానీ వాటిలో ఏముంది అన్నది మాత్రం ఇప్పటికీ చీకటిలోనే ఉంది.

ఇంతకీ టర్కీ ఏదైనా కొత్త సైనిక సామగ్రిని ఇస్లామాబాద్‌కు పంపుతోందా? ఆ సామగ్రి డ్రోన్లా? ఎయిర్ డిఫెన్స్ పరికరాలా? లేదా సాధారణ సైనిక లాజిస్టిక్సా? ఇప్పటివరకు టర్కీ కానీ పాకిస్థాన్ కానీ ఈ విమానాల్లో ఏం తరలించారో అధికారికంగా చెప్పలేదు. అందుకే దీన్ని ఆయుధ సరఫరా అని ఇప్పటికైతే చెప్పలేం. అయితే ఈ కదలిక ఇప్పుడు ఎందుకు ఇంత ఆసక్తిని రేపుతోందంటే దాని వెనుక ఒక పెద్ద నేపథ్యం ఉంది.

ఆగస్టు 7న మక్కాలో టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియా కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానూ పరిగణించే విధంగా సామూహిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఇది సాధారణ దౌత్య ప్రకటనలా కనిపించినా, దాని వెనుక ప్రాంతీయ భద్రతా సమీకరణం మారుతున్న కథ ఉంది. టర్కీకి బలమైన సైనిక పరిశ్రమ ఉంది. పాకిస్థాన్‌కు పెద్ద సైనిక వ్యవస్థ ఉంది. సౌదీ అరేబియాకు ఆర్థిక శక్తి ఉంది. ఇక టర్కీ, పాకిస్థాన్ సంబంధాలు కూడా ఈరోజు మొదలైనవి కావు. కొన్నేళ్లుగా ఇరు దేశాలు డ్రోన్లు, నౌకాదళ సామగ్రి, సైనిక సాంకేతికత వంటి రంగాల్లో తమ సహకారాన్ని పెంచుకున్నాయి. ఆ సంబంధంలో డ్రోన్లకు ప్రత్యేక స్థానం వచ్చింది. ఎందుకంటే ఆధునిక యుద్ధంలో ఆకాశంలో కనిపించే పెద్ద యుద్ధవిమానాల కంటే చిన్న డ్రోన్లు, వాటిని గుర్తించే రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, వాటిని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లు కూడా అంతే కీలకంగా మారాయి. ఈ విషయం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో మరింత స్పష్టంగా కనిపించింది.

2025 మేలో జరిగిన ఆ ఘర్షణలో డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యుద్ధభూమిలో ఎంత కీలకంగా మారాయో రెండు దేశాల సైనిక చర్యలు చూపించాయి. పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో డ్రోన్ చొరబాట్లు జరిగాయని ఇండియా ఆరోపిస్తోంది. వాటిలో కొన్ని టర్కీకి చెందిన అసిస్‌గార్డ్ సోంగార్ డ్రోన్లుగా ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశీలనలో గుర్తించినట్టు భారత విదేశాంగ శాఖ చెబుతోంది.

అదే సమయంలో భారత్ తన సమగ్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించింది. ఆకాష్ లాంటి స్వదేశీ వ్యవస్థలతో పాటు ఇతర రక్షణ వ్యవస్థలు కూడా పనిచేశాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను గుర్తించడం, వాటి దిశను అంచనా వేయడం, అవసరమైన చోట వాటిని అడ్డుకోవడం అనే మొత్తం ప్రక్రియ ఒక విషయం స్పష్టం చేసింది. దీనిబట్టి భవిష్యత్తు యుద్ధం ఆకాశంలో కనిపించని సాంకేతికతల మధ్య జరిగే పోరాటమని అర్థంచేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు టర్కీ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్ స్థావరాల్లో వరుసగా కనిపించడం భారత్‌లో ఆసక్తిని రేపుతోంది. ఇక ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన లోపాలను భర్తీ చేసుకుంటోందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా డ్రోన్ సామర్థ్యం, ఎయిర్ డిఫెన్స్, నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లాంటి రంగాల్లో కొత్త సామర్థ్యాలను జోడించుకుంటోందా అనే ప్రశ్న మరింత ముఖ్యమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

పాకిస్థాన్‌ ఒంటరిగా నిలబడే దారిలో లేదు. ఒకవైపు చైనా, మరోవైపు టర్కీ, ఇప్పుడు సౌదీ అరేబియాతో కొత్త రక్షణ ఒప్పందం. ఆ మధ్యలో ఆపరేషన్ సిందూర్ నుంచి నేర్చుకున్న పాఠాలు. ఇవన్నీ కలుస్తున్న చోట పాకిస్థాన్ తన సైనిక సామర్థ్యాన్ని కొత్తగా మలుచుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది. మరి చూడాలి టర్కీ-పాకిస్థాన్‌ ఎందుకింత స్నేహంగా ముందుకు వెళ్తున్నాయో రానున్న రోజుల్లో తేలిపోనుంది.