Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!

Iran Peacock Mountain

Iran Peacock Mountain

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై జూన్‌లో దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న అత్యంత పటిష్టమైన పీకాక్స్ మౌంటైన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పికాక్స్ మౌంటైన్‌పై అమెరికా కన్ను ఎందుకు పడింది? ట్రంప్ దీన్ని ఎందుకు టార్గెట్ చేశారు?

పికాక్స్‌ మౌంటైన్ ఎందుకు కీలకం?

ఇరాన్‌లోని పికాక్స్ మౌంటైన్ అణు క్షేత్రంపై అమెరికా మిలిటరీ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వాషింగ్టన్‌లోని ‘హ్యూ హెవిట్ షో’ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పికాక్స్ మౌంటైన్ ను తాము ఖచ్చితంగా ధ్వంసం చేస్తామని… ఇరాన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితమే ఇరాన్‌కు చెందిన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులతో విరుచుకుపడింది. ఆ దాడుల్లో ఫోర్డో క్షేత్రం పూర్తిగా దెబ్బతిందని, ఇరాన్ యురేనియం శుద్ధి సామర్థ్యం రెండేళ్లు వెనక్కి వెళ్ళిందని నివేదికలు చెబుతున్నాయి.

పికాక్స్ మౌంటైన్ పరిసరాల్లో జరుగుతున్న ప్రతి కదలికను అమెరికా నిశితంగా గమనిస్తోంది. అంతరిక్షం నుంచి పికాక్స్ క్షేత్రంలోని వ్యక్తుల బ్యాడ్జీలను, పేర్లను కూడా చదవగలిగే కెమెరాలు తమకు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. ఇరాన్ అక్కడ ఎలాంటి ప్రయత్నం చేసినా వెంటనే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారుల తనిఖీల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. తాము కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నామని… పికాక్స్ మౌంటైన్ ప్రధాన ద్వారంపై పెద్ద దాడికి వ్యూహం సిద్ధం చేశామని ట్రంప్ ప్రకటించారు.

పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రం ఇరాన్‌లోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉంది. ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన, బలమైన రక్షణ వలయం ఉన్న అణు స్థావరం. పర్వత గర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన రెండు టన్నెల్ కాంప్లెక్స్ లు ఈ క్షేత్రంలో ఉన్నాయి. అమెరికా సైన్యం దగ్గరున్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా ఈ టన్నెల్స్‌ను ఏమీ చేయలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2007లో ప్రారంభమైన ఈ టన్నెల్ కాంప్లెక్స్‌ను కాలక్రమేణా మరింత పటిష్టం చేశారు.

పికాక్స్ మౌంటైన్ ఎక్కడుంది?

పికాక్స్ మౌంటైన్ సముద్ర మట్టానికి సుమారు 1,608 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వత శ్రేణుల కింద కనీసం 100 మీటర్ల లోతులో భూగర్భ అణు కేంద్రం ఉందని అంచనా వేస్తున్నారు. పర్వతానికి తూర్పు, పశ్చిమ దిశల్లో రెండు జంట టన్నెల్ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారం పర్వత శిఖరం నుంచి 145 మీటర్ల లోతులో, పశ్చిమ ద్వారం 100 మీటర్ల లోతులో ఉంటాయి. ఈ రెండు ద్వారాల మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసాన్ని బట్టి, ఈ భూగర్భ కేంద్రంలో పలు అంతస్తులు ఉండే అవకాశం ఉందని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఓ అంచనా వేసింది.

పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రం పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. జూన్ లో జరిగిన దాడుల వల్ల ఇరాన్ సెంటిఫ్యూజ్ తయారీ సామర్థ్యం దెబ్బతిన్న మాట నిజమే. ఒకవేళ ఇరాన్ మళ్లీ సెంటిఫ్యూజ్ నెట్ వర్క్ ను నిర్మిస్తే, దానికోసం పికాక్స్ మౌంటైన్ ను వాడుకునే అవకాశం ఉంది. ఇక్కడి భూగర్భ స్థలంలో ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేయవచ్చు. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం మెటల్ ను ఉత్పత్తి చేసేందుకు కూడా ఇరాన్ ఈ కేంద్రాన్ని ఉపయోగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.