స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలోకి రాకుండా మన దేశానికి చెందిన సంపన్న వ్యాపారులు అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. ఇందులో నిజం ఎంతో పక్కన పెడితే… ఈ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మస్క్ కామెంట్స్ సంగతేమో గానీ… ఆయన ఓనర్ గా ఉన్న స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలతో చాలా పెద్ద సమస్యే ఉంది. అది కేవలం మామూలు ఇంటర్నెట్ కనెక్షన్ల వ్యవహారం మాత్రమే కాదు… దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా ఉంది. అందుకే కేంద్రం స్టార్ లింక్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందా?
స్టార్ లింక్ అనేది నేరుగా శాటిలైట్ తో కనెక్ట్ అయిన ఇంటర్నెట్ వ్యవహారం. జియో, ఎయిర్ టెల్, ఐడియా లాగా కాదు… స్టార్ లింక్ ద్వారా నేరుగా శాటిలైట్ నుంచే దేశంలో ఏ మూలకైనా కనెక్టవిటీ అందించవచ్చు.. టవర్స్ లేవు… సిగ్నల్స్ రావడం లేదన్న చర్చే ఉండదు. అందుకే స్టార్ లింక్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయ్యింది. మన పొరుగు దేశాల్లో కూడా స్టార్ లింక్ సేవలు ఉన్నా… ఇండియా మాత్రం ఇంకా అప్లికేషన్ దశలోనే ఉంది. అయితే తమ సేవలు భారత్ లో ఇంకా రాకపోవడానికి మాత్రం టెలికాం మార్కెట్‌ను గుత్తాధిపత్యంలో ఉంచుకునే కొందరు వ్యక్తులే అంటూ ఎలన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను వెంటనే ఖండించింది. శాటిలైట్ కమ్యూనికేషన్ల కోసం తమ విధానాలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం మూడు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చామని తెలిపింది. స్పెక్ట్రమ్ కేటాయింపులకు ముందు వీటికి సంబంధించిన భద్రతాపరమైన అంచనాలు కొనసాగుతున్నాయని టెలికాం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ విధానాలు వివక్షతో ఉన్నాయన్న మస్క్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి చెప్పింది.
అయితే ఈ రెగ్యులేటరీ వివాదం వెనుక మరో పెద్ద సమస్యే దాగి ఉంది. అంతరిక్షం ఆధారంగా పనిచేసే కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కావడంతో దీని ఆపరేటింగ్ సంస్థ స్పేస్ ఎక్స్ చేతిలో అపారమైన నియంత్రణ అధికారాలు ఉంటాయి. ఎవరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి… ఎక్కడ నెట్‌వర్క్ ఆపరేట్ చేయాలి… టెర్మినల్స్ ఎప్పుడు కనెక్ట్ కావాలి అనేదంతా ఆ కంపెనీయే నిర్ణయిస్తుంది.
ఈ స్టార్ లింక్ సమస్యకు ఉక్రెయిన్ సంక్షోభం అతిపెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రష్యా దాడులతో సాధారణ సమాచార వ్యవస్థలు ధ్వంసమైనప్పుడు ఉక్రెయిన్‌కు స్టార్ లింక్ సేవలు చాలా కీలకంగా మారాయి. అయితే 2022 సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ ప్రతిదాడి చేస్తున్న సమయంలో ఖేర్సన్ ప్రాంతంతో పాటు పలుచోట్ల స్టార్ లింక్ సేవలను మస్క్ నిలిపివేశారు. దీనివల్ల మిలటరీ కమ్యూనికేషన్లతో పాటు డ్రోన్ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యా బలగాలపై దాడుల్లో స్పేస్ ఎక్స్ ప్రత్యక్షంగా పాల్గొనడం ఇష్టం లేకే సేవలను యాక్టివేట్ చేయలేదని మస్క్ స్వయంగా చెప్పారు. ఒక దేశ ఇంటర్నెట్ మొత్తాన్ని కట్ చేసే మ్యాజిక్ బటన్ లేకపోయినా.. భౌగోళికంగా యాక్సెస్‌ను కట్టడి చేసే సత్తా, టెర్మినల్స్ డిసేబుల్ చేసే సామర్థ్యం స్పేస్ ఎక్స్‌కు ఉంది. దీన్నే టెలికాం భాషలో కిల్ స్విట్ అని చెబుతారు…
కేవలం ఉక్రెయిన్ విషయంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ స్పేస్ ఎక్స్ తన నెట్‌వర్క్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సూడాన్ అంతర్యుద్ధంతో స్థానిక టెలికాం వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు స్టార్ లింక్ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ అక్కడ స్టార్ లింక్ రోమింగ్‌ను పరిమితం చేయడంతో లక్షలాది మందికి కనెక్షన్లు పోతాయని మానవతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు మయన్మార్‌లో వేలాది స్టార్ లింక్ టెర్మినల్స్‌ను స్పేస్ ఎక్స్ రిమోట్ ద్వారా డీయాక్టివేట్ చేసింది. అక్రమ స్కామ్ సెంటర్లు వీటిని వాడుతున్నాయని గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. స్టార్ లింక్ టెర్మినల్ సాధారణ డిష్‌లా సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకోవడమే కాదు.. అది ఒక మేనేజ్డ్ నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. నెట్‌వర్క్ యాక్సెస్ మొత్తం స్పేస్ ఎక్స్ కంట్రోల్‌లోనే ఉంటుంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్న అంశం ఇదే. నిజానికి భారత్‌కు అత్యుత్తమ టెలికాం నెట్‌వర్క్, బలమైన నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యవసర సమయాల్లో ఒకే విదేశీ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉండే కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పై ఎంతవరకు ఆధారపడొచ్చన్నది అసలు ప్రశ్న. యుద్ధం, విపత్తులు, సైబర్ దాడులు జరిగినప్పుడు భూగర్భ కేబుల్స్ పనిచేయకపోతే స్టార్ లింక్ ద్వారా కనెక్టివిటీ అందుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అయినప్పటికీ నెట్‌వర్క్ కంట్రోల్ ప్రైవేట్ సంస్థ చేతుల్లోనే ఉండటం అతిపెద్ద సెక్యూరిటీ ముప్పుగా మారుతుంది. అందుకే స్పెస్ ఎక్స్ అంటే కేవలం బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ మాత్రమే కాదు… జాతీయ భద్రతా వ్యవహారం కూడా. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్ అయిన భారత్ స్టార్ లింక్ విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

