పోలీసు వ్యవస్థే ఫిర్యాదు చేసి… ఆ పోలీసు వ్యవస్థే న్యాయమూర్తిగా మారి… చివరకు శిక్ష కూడా ఖరారు చేస్తే సామాన్యుడికి న్యాయం ఎలా దక్కుతుంది? ఒక ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పౌరులను జైలుకు పంపడం చట్టబద్ధమేనా? కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జైలుకు పంపిన వ్యవహారంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వ్యవస్థపై సందేహాలు కలుగుతున్నాయి. కోర్టులతో సంబంధం లేకుండా అసలు ఈ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు ఎవరు ? వాళ్లకున్న అధికారాలేంటి? అసలు వాళ్ల అవసరం ఏంటి?
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేసినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 10న జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని పీస్ బాండ్లు రాయించుకున్నారు. ఆ పీస్ బాండ్లను ఉల్లంఘించారనే నెపంతో అక్టోబర్ 14న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మహేష్ కుమార్ మీనా ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వెంటనే వీళ్లను తీహార్ జైలుకు కూడా తరలించారు.
న్యాయవాదులు కొత్త పూచీకత్తులు సమర్పించినా SEM కోర్టు వాటిని తిరస్కరించింది. పత్రాలు, ఆధార్ కార్డులలో ఫోటోలు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలు చూపి మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. ఇలా పూచీకత్తుల పరిశీలన పేరుతో కస్టడీని పొడిగించడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ స్పష్టం చేశారు. 2018 నాటి అల్దానిష్ రీన్ తీర్పులో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కస్టడీకి పంపడం చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన చెబుతున్నారు.
బీఎన్ఎస్ సెక్షన్ 15, సెక్షన్ 126 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అధికారులను SEMలుగా నియమిస్తున్నాయి. దీనివల్ల పోలీసు వ్యవస్థే ఫిర్యాదుదారుగా, న్యాయమూర్తిగా, శిక్షలు అమలు చేసే వ్యవస్థగా మారుతోంది. ఏ వ్యక్తి తన సొంత కేసుకు తానే న్యాయమూర్తిగా వ్యవహరించకూడదనే సహజ న్యాయ సూత్రానికి ఇది పూర్తిగా విరుద్ధం. స్వతంత్ర న్యాయవ్యవస్థలో భాగమైన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు, పోలీసు విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఈ SEM వ్యవస్థ అనేది బ్రిటిష్ పాలకులు తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో అమలులోకి తెచ్చారు. అయితే బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో చాలా మార్పులు చేసి BNSను తీసుకొచ్చినా… స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వంటి వ్యవస్థలు మాత్రం అలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వాలు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ప్రివెంటివ్ అరెస్టులు చూపి జైలుకు పంపడం ద్వారా పోలీసులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా తప్పించుకుంటున్నారు.
SEMల అధికారాల దుర్వినియోగంపై గతంలో బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. న్యాయవ్యవస్థలో భాగం కాని ఈ అధికారుల పేరు నుంచి మేజిస్ట్రేట్ అనే పదాన్ని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. దేశంలో సాధారణ ప్రజలు.. కూలీలు.. నిరసనకారులు ఈ చట్టాల వల్లే ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం నిరసన తెలిపారన్న కారణంతో సీజేపీ నేతలను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జైలుకు పంపడంతో మళ్లీ ఈ వ్యవస్థపై చర్చ మొదలైంది.

