ఒక ఉదయం నిద్రలేచేసరికి మనం నిన్నటి వరకు చూసిన తీరప్రాంతంలోని కొంత భాగం నీటిలో కనిపిస్తే? రోడ్లు నదుల్లా మారితే? తాగడానికి దాచుకున్న నీటిలో సముద్రపు ఉప్పు చేరితే? తరతరాలుగా ఒకే ప్రాంతంలో జీవించిన కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తే? ఇది ఏదో విపత్తు సినిమాలో కనిపించే దృశ్యం అనిపించొచ్చు కానీ ప్రపంచంలోని తీర ప్రాంతాల భవిష్యత్తు గురించి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన తాజా హెచ్చరిక చూస్తే ఇది సినిమా కథ కాదని అర్థమవుతుంది.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సముద్ర మట్టాల పెరుగుదల మానవ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత వేగంతో కొనసాగుతోంది. 2024లో ప్రపంచ సముద్ర మట్టం ఒక్క ఏడాదిలో దాదాపు 6 మిల్లీమీటర్లు పెరిగింది.
భూమి వేడెక్కుతున్న కొద్దీ సముద్రపు నీరు విస్తరించడం, హిమనదాలు , మంచు పలకలు కరగడం దీనికి ప్రధాన కారణాలు. ఈ ప్రమాదం ప్రపంచంలోని దాదాపు ప్రతి తీరప్రాంతాన్ని తాకుతున్నా, తక్కువ ఎత్తులో ఉన్న నగరాలు, నదీ డెల్టాలు ఎక్కువగా చిక్కుకుంటున్నాయి. భారత్‌లో ఆ జాబితాలో ముంబై, కోల్‌కతా అత్యంత ముఖ్యమైన నగరాలు. ఇక ముంబైలో సముద్రం చుట్టూ విస్తరించిన నగర జీవితం ఉంది. కోల్‌కతా గంగా డెల్టా ప్రాంతానికి సమీపంలో ఉన్న తక్కువ ఎత్తు భూభాగంపై విస్తరించింది.
సముద్ర మట్టం పెరుగుతున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో భూమి కూడా క్రమంగా కుంగిపోతే నీటికి అందుబాటులోకి వచ్చే భూభాగం మరింత పెరుగుతుంది. దక్షిణాసియాలోని ముంబై, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా లాంటి తక్కువ ఎత్తు ప్రాంతాల్లో 14 మిలియన్లకు పైగా ప్రజల నివాసాలు శాశ్వతంగా నీట మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
ఇక్కడ ప్రమాదం కేవలం వరదలతో ఇళ్లు మునిగిపోవడం వరకే ఆగదు. సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చేరితే తాగునీటి వనరులు కలుషితమవుతాయి. నేలలో ఉప్పుతనం పెరిగితే వ్యవసాయం దెబ్బతింటుంది. సాగునీరు, భూగర్భ జలాలు, తీర ప్రాంత జీవవ్యవస్థలు ప్రభావితమవుతాయి. నగరాలను నడిపించే రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వ్యవస్థలు, ఆసుపత్రులు, వ్యాపారాలు కూడా ఈ నీటి ముప్పు ముందు బలహీనపడవచ్చు.
అసలు భయపెట్టే విషయం ఏంటంటే, సముద్రం పెరుగుతున్న వేగం భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం దాదాపు 770 మిలియన్ల మంది ప్రజలు అధిక ఆటుపోట్ల రేఖకు 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు సముద్ర మట్టాల పెరుగుదలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ సగటు సముద్ర మట్టం దాదాపు 0.23 మీటర్లు పెరిగే అవకాశం ఉందని వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ అంచనా వేసింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు చాలా తక్కువగా ఉండే పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నా ఈ పెరుగుదల సంభవించే అవకాశం ఉంది.
ప్రపంచం తగినంతగా సిద్ధం కాకపోతే 2050 నాటికి 120 కోట్ల మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల నుంచి తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. పసిఫిక్ ద్వీపాల్లోని కొన్ని సముదాయాలు ఇప్పటికే తమ భూభాగం క్రమంగా కోల్పోతుండటంతో పునరావాస ప్రక్రియలను ప్రారంభించాయి.
ఆర్థిక నష్టం కూడా ఊహించలేనంత పెద్దది. తీర ప్రాంత మౌలిక సదుపాయాలకు ఇప్పటికే 1.8 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం జరుగుతోంది. అనుసరణ చర్యలు తగినంతగా లేకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 1.2 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇటు ప్రపంచంలోని ఇతర తీర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా రాబోయే ప్రమాదానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. జర్మనీ తీరరేఖలో దాదాపు 70 శాతం సముద్రపు కోతను ఎదుర్కొంటోంది.
ఫ్రెంచ్ రివియెరాలోని చిన్న ఇసుక తీరాలు 19వ శతాబ్దం చివరి నుంచి దాదాపు 50 శాతం తమ విస్తీర్ణాన్ని కోల్పోయాయి. కరీబియన్ ప్రాంతంలో 2050 నాటికి దాదాపు 40 శాతం బీచ్‌లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 18 చర్యలను సూచించింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వేగంగా తగ్గించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, వాతావరణ అనుసరణకు నిధులు పెంచడం, శాస్త్రీయ సమాచారాన్ని మెరుగుపరచడం, ప్రమాదంలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించడం ఇందులో ఉన్నాయి.
ఎందుకంటే సముద్ర మట్టం పెరుగుదల ఒకరోజు అకస్మాత్తుగా తలుపు తట్టే విపత్తు కాదు కదా. అది ఈరోజు కొన్ని మిల్లీమీటర్లుగా మొదలై, రేపు వరదగా, ఎల్లుండి తాగునీటి సంక్షోభంగా, చివరికి మనుషులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితిగా మారే ప్రక్రియ. ఆ మార్పు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. భారత్‌లో దాని నీడ ముంబై, కోల్‌కతా తీరాలపై ఇప్పటికే పడడం మిగిలిన కోస్టల్ నగరాలకు వార్నింగ్ బెల్‌గా చెప్పవచ్చు.

