కొంచెం తాగితే పర్లేదని కొందరు వాదిస్తారు.. డాక్టర్లే తాగమని చెప్పారని ఇంకొందరి వింత వాదన.. అయితే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగినా అది అనారోగ్యమే. యాడ్ కంపెనీలు ప్రమోట్ చేసిన వాటిని నమ్మేసి..డాక్టర్లు కొంచెం తాగినా ఏంకాదని చెప్పేవారికి ఇదే హెచ్చరిక. ప్రోటీన్ బీర్ అయినా.. విటమిన్ విస్కీ అయినా అందులో ఆల్కహాల్ కలిస్తే అది చెడే చేస్తుంది కానీ..అవి తాగితే విరాట్ కోహ్లీ లాగా ఫిట్‌నెస్ వస్తుందని మోసపోకండి. ఎందుకంటే ఇప్పటివరకు బీర్ అంటే ఆల్కహాల్ లెబుల్ మాత్రమే. ఇకపై అదే బాటిల్ మీద ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్, తక్కువ క్యాలరీలు అనే పదాలు కనిపించబోతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కాలంలో బీర్ కూడా తన రూపాన్ని మార్చుకుంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద బీర్ కంపెనీల్లో ఒకటైన ఇన్‌బెవ్ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది.
చిన్న ప్యాక్‌లతో పాటు ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్ కలిపిన బీర్‌లను తీసుకురావాలని చూస్తోంది. బ్రెజిల్‌లో ఇప్పటికే స్పాటెన్ పేరుతో ప్రోటీన్ కలిపిన వెర్షన్‌ను తీసుకొచ్చింది. అంతేకాదు, ఆల్కహాల్ లేని బీర్‌లలో కూడా ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్ ఉపయోగించబోతున్నట్టు కంపెనీ చెబుతోంది.
ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. ప్రోటీన్ అంటే మన శరీరానికి అవసరమైన పదార్థం. కండరాలను నిర్మించడానికి, దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేయడానికి అది అవసరం. ఎలక్ట్రోలైట్స్ కూడా శరీరంలో నీరు, లవణాల బ్యాలెన్స్‌ను కాపాడటంలో కీలకం. కానీ మంచి పదార్థాన్ని బీర్‌లో కలిపినంత మాత్రాన బీర్ స్వభావం మారిపోదు.
ముఖ్యంగా అందులో ఆల్కహాల్ ఉంటే ఈ లెక్క ఇంకా మారదు. ఎందుకంటే శరీరం ప్రోటీన్‌ను ఎలా ఉపయోగిస్తుందో ఒక విషయం, ఆల్కహాల్ శరీరంపై ఏం చేస్తుందో మరో విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆల్కహాల్ 200కు పైగా వ్యాధులు, గాయాలు, ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా ఆల్కహాల్ పెంచుతుంది. అందుకే బీర్‌లో కొంత ప్రోటీన్ చేరిందని చూసి దాన్ని ప్రోటీన్ డ్రింక్‌లా ఊహించుకోవడం సైంటిఫిక్‌గా సరైన ఆలోచన కాదు. ఎలక్ట్రోలైట్స్ విషయంలో కూడా ఇదే కథ.
ఎక్కువగా చెమట పట్టినప్పుడు లేదా శరీరం నీటిని, లవణాలను కోల్పోయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఉపయోగపడతాయి. కానీ ఆల్కహాల్ మాత్రం శరీరం నుంచి నీరు బయటకు వెళ్లే ప్రక్రియను పెంచుతుంది. అంటే ఒక వైపు ఎలక్ట్రోలైట్స్‌ను జోడించి నీటి సమతుల్యత గురించి మాట్లాడుతూనే, మరో వైపు ఆల్కహాల్ ఆ బ్యాలెన్స్‌ను దెబ్బతీయగలదు. నిజానికి మారుతున్నది బీర్ ఫార్ములా కంటే మనం ఆరోగ్యాన్ని చూసే విధానం కావచ్చు.
ఈరోజు ప్రోటీన్ అనే పదం జిమ్ దగ్గర నుంచి సూపర్‌మార్కెట్ వరకూ వచ్చింది. ఎలక్ట్రోలైట్స్ అంటే వెంటనే హైడ్రేషన్ గుర్తొస్తుంది. తక్కువ క్యాలరీలు అంటే వెంటనే ఆరోగ్యకరమైన ఎంపిక అనే భావన వస్తుంది. ఈ మూడు పదాలను ఒకే బాటిల్ మీద పెట్టినప్పుడు ఆ బాటిల్ గురించి మన మెదడులో ఏర్పడే చిత్రం కూడా మారుతుంది.
అయితే ఒక చిన్న తేడా చాలా పెద్దది. బ్రెజిల్‌లో వచ్చిన స్పాటెన్ ప్రో లాంటి కొత్త ఉత్పత్తుల్లో ఆల్కహాల్ లేని వెర్షన్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు స్పాటెన్ ప్రోలో 350 మిల్లీలీటర్ల క్యాన్‌కు 10 గ్రాముల ప్రోటీన్ ఉంది. అందులో 75 శాతం హైడ్రోలైజ్డ్ వీ ప్రోటీన్, 25 శాతం హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ నుంచి వస్తుంది. కానీ ఆల్కహాల్ ఉన్న బీర్‌కు కేవలం ప్రోటీన్ లేదా ఎలక్ట్రోలైట్స్ జోడించడం మాత్రం దాని ఆరోగ్యపరమైన ప్రభావాన్ని మార్చదు. అందుకే ఇకపై బీర్ బాటిల్ మీద కనిపించే పెద్ద పదాల కంటే, మనం చూడాల్సిన చిన్న అక్షరాలు ముఖ్యమైనవి.
ప్రోటీన్ ఎంత ఉంది? క్యాలరీలు ఎంత ఉన్నాయి? ముఖ్యంగా ఆల్కహాల్ ఎంత ఉంది? ఎందుకంటే ఒక డ్రింక్‌కి ఆరోగ్యకరమైన పదార్థం జోడించడం వల్ల అందులో ఉన్న ఆల్కహాల్ మాత్రం ఆరోగ్యకరంగా మారిపోదని గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ ఎప్పటికైనా..అందులో ఏం కలిపినా ప్రమాదమే!

