Political News and Mental Health: మనకు ఇష్టమైన, మనం సమర్థించే ఓ సామాజిక లేదా రాజకీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలనిపించడం సహజం. కానీ ఆ వార్తలే మన నిద్రను, మనశ్శాంతిని హరిస్తే పరిస్థితి ఏంటి? ఇంటి వద్ద కూర్చుని సోషల్ మీడియాలో నిరసనలను చూస్తూ టెన్షన్ పడుతున్న చాలామందిలో ఇప్పుడు ఇదే ఆందోళన కనిపిస్తోంది. ఉద్యమాలపై స్పందించడం, వార్తలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారు? ఆ వివరాలు పూర్తిగా చూద్దాం..
ప్రత్యక్ష ఉదాహరణ..
జూలై 20వ తేదీన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నీట్ వివాదం కారణంగా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక, కన్సల్టెన్సీలో జాబ్ చేసే దీక్షిత్ కాలేజ్ రోజుల్లో ఇలాంటి ఆందోళనల్లో చాలాసార్లు పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతల వల్ల పెద్దగా బయటకు వెళ్లలేకపోతున్నాడు. అయితే సోషల్ మీడియా ద్వారా రాజకీయ పరిణామాలను ఎప్పుడూ ఫాలో అవుతుంటాడు. ఆ రోజు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలు చూసి అతనికి వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలనిపించింది. కానీ ఆఫీస్ పని కారణంగా వెళ్లలేకపోయాడు. దీంతో ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ తదితర ప్లాట్‌ఫారమ్‌లలో అప్డేట్స్ చూస్తూ గడిపాడు. ఆ రోజంతా సుమారు 16 గంటలకు పైగా ఫోన్‌కే అతుక్కుపోయాడు. సెలవు రోజు హాయిగా విశ్రాంతి తీసుకుందాలనుకున్నా, రోజంతా వీడియోలు చూస్తూనే గడిపేశాడు. ఇది తన నిద్రను, రోజువారీ పనులను తీవ్రంగా దెబ్బతీసిందని, అయినా సరే అప్డేట్స్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆగలేదని దీక్షిత్ వాపోయాడు. ఇది ఒక్క దీక్షిత్ సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఘటనే మళ్లీ ఢిల్లీలో పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అవకతవకలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలను కూడా లక్షలాది మంది ఇలాగే చూస్తున్నారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్యకర్తలు దీనిలో పాల్గొంటున్నారు. అరెస్టులు, ఆంక్షల వార్తలతో దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారు. కానీ చాలా మందికి రాజకీయ మార్పులకు, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అసలు తెలియడం లేదు.
మనస్తత్వంపై వార్తల ప్రభావం..
బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్. వైజయంతి వెంకటరాము చెప్పినట్లుగా.. రాజకీయ పరిణామాలు కేవలం ప్రత్యక్షంగా పాల్గొనేవారినే కాదు, దూరంగా ఉన్నవారిని కూడా మానసికంగా ప్రభావితం చేస్తాయి. మన హక్కులు, భద్రత, జీవనోపాధి ప్రమాదంలో పడినప్పుడు మన మెదడు దానిని ఒక ముప్పుగా భావిస్తుంది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా (hyper-vigilance) ఉండేలా చేస్తుంది. ఏ మాత్రం సంబంధం లేకపోయినా, డిస్టర్బింగ్ ఇమేజెస్ చూసినప్పుడు మెదడు ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటుంది. దీనివల్ల శారీరకంగా మనం సేఫ్‌గా ఉన్నప్పటికీ, మానసికంగా చిరాకు, ఆందోళన వెంటాడుతుంటాయి.
ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం..
బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పత్రిలోని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుగామి రమేష్ ఈ అంశంపై స్పందించారు. నిరంతరం సోషల్ మీడియాలో ఆడియో-విజువల్ కంటెంట్ చూడటం వల్ల మన ఆలోచనా సరళి మారిపోతుందని తెలిపారు. “నిరంతరం అప్డేట్స్ చెక్ చేయాలనే కోరిక పెరుగుతుంది. మెదడు ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలతో, రేసింగ్ థాట్స్‌తో అశాంతిగా ఉంటుంది. తినేటప్పుడు, కూర్చునేటప్పుడు, అర్ధరాత్రి నిద్ర మానుకుని మరీ ఫోన్ స్క్రోల్ చేయడం అలవాటుగా మారుతుంది.” అని రమేష్ వివరించారు. అయితే.. డాక్టర్ వైజయంతి చెప్పినట్లుగా, పదే పదే న్యూస్ రిఫ్రెష్ చేయడం వల్ల మనకు అంతా మన కంట్రోల్లోనే ఉందనే ఓ భ్రమ కలుగుతుంది. కానీ దీనివల్ల మనకు ఒత్తిడి పెరగడం మినహా, పరిస్థితిని మార్చే శక్తి రాదు. “నేను నిజంగా తెలుసుకోవడానికి చూస్తున్నానా? లేదా ఆపలేక చూస్తున్నానా?” అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. రాజకీయ పరిణామాలపై కోపం, ఆందోళన కలగడం అంటే వెంటనే మానసిక సమస్య ఉన్నట్లు కాదు. ముఖ్యంగా హక్కులు, సంఘాలు ప్రమాదంలో ఉన్నాయని భావించినప్పుడు ఇది సహజం. అయితే ఈ ఆందోళన ఎప్పుడైతే నిరంతరంగా కొనసాగుతూ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో అప్పుడే సమస్య మొదలవుతుంది. హింస, వివక్ష, జీవనోపాధి కోల్పోవడం వంటి ప్రత్యక్ష అనుభవాలు ఉన్నవారికి, గతంలో ట్రామా ఉన్నవారికి, ఆర్థిక అనిశ్చితిలో ఉన్నవారికి ఇవి తట్టుకోవడం కష్టమవుతుంది. కానీ భావోద్వేగపూరిత సమాచారాన్ని నిరంతరం సేకరించే ఎవరైనా సరే దీని బారిన పడవచ్చు. నిద్రలేమి, ఆకలి తగ్గడం లేదా పెరగడం, పనులు వాయిదా వేయడం, చిరాకు రావడం, ఒంటరితనం భావించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ రమేష్ వివరించారు. ఇవన్నీ తాత్కాలికమే అనుకుని వదిలేస్తే సమస్య మరింత పెరుగుతుంది.
విలువలకు తగ్గట్టు ప్రవర్తించాలి..
అలాగే రాజకీయ ఉద్రిక్తతలు వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఒక పాలసీ, పార్టీ లేదా నాయకుడి గురించి మొదలైన చర్చ కాస్తా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగుల మధ్య పరస్పర విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు దారితీస్తుంది. ఒకరి రాజకీయాభిప్రాయాలను వారి వ్యక్తిత్వానికి ఆపాదించి చూసినప్పుడు అక్కడ వినడం కష్టమైపోతుంది. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన ఇతరులను కేవలం వారి రాజకీయ వైఖరి ద్వారానే అంచనా వేయాల్సిన అవసరం లేదు. ప్రతి చర్చతోనూ రాజీ పడాల్సిన పనిలేదని, అవసరమైనప్పుడు ఆ సంభాషణల నుంచి తప్పుకోవడం ఆరోగ్యకరమని డాక్టర్ విజయంతి సూచించారు. అయితే, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండటమే దీనికి పరిష్కారమా అంటే కాదనే చెప్పాలి. బాధ్యత గల పౌరుడిగా ఉండటానికి రాజకీయ పరిణామాలు తెలుసుకోవడం అవసరమే. కానీ నిరంతర ఎక్స్పోజర్కు, సమాచారం తెలుసుకోవడానికి మధ్య తేడాను గుర్తించాలి. నమ్మదగిన వార్తలను నిర్దిష్ట సమయాల్లో మాత్రమే చూడటం, అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం, గ్రాఫిక్ కంటెంట్‌కు దూరంగా ఉండటం చేయాలి. వాట్సాప్ ఫార్వర్డ్‌లలో వచ్చే అబద్ధాలను ప్రతిసారీ సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ అలసిపోకుండా, ఎక్కడ స్పందించాలి, ఎక్కడ మౌనంగా ఉండాలనేది నిర్ణయించుకోవాలి. అనవసరమైన విషయాలపై శక్తిని వృథా చేయకుండా, మనం మార్చలేని పరిస్థితులను హద్దులు దాటేందుకు ప్రయత్నించకూడదు. ఇక సోషల్ మీడియాలో వార్తలు చూసి నిస్సహాయంగా భావించే బదులు, అర్థవంతమైన పనుల్లో పాల్గొనడం మానసిక స్థితిని మారుస్తుంది. శాంతియుత నిరసనలు, సామాజిక కార్యక్రమాలు లేదా సమిష్టి కృషితో ఒక ఉద్దేశం, బాధ్యత లభిస్తాయి. అయితే అందరూ ప్రయాణాలు చేసి నేరుగా నిరసనల్లో పాల్గొనలేకపోవచ్చు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా దూర ప్రాంతాల వల్ల వెళ్లలేకపోవడం అంటే ఆ అంశంపై ఆసక్తి లేదని అర్థం కాదు. అలాగని ప్రతి చిన్న అప్డేట్ను ఫాలో అవ్వడం కూడా తప్పనిసరి కాదు. సమాచారాన్ని ధృవీకరించుకోవడం, ప్రభావితమైన సమాజానికి అండగా నిలవడం లేదా మన విలువులకు తగ్గట్టు పనుల్లో భాగం కావడం మంచిది.
మొత్తంగా చెప్పాలంటే, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దేనికోసం మనం పోరాడుతున్నామో, లేదా దేనిని ఆందోళనతో చూస్తున్నామో వాటిపై స్పష్టత ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, ఇతరుల ప్రభావం మనపై ఎలా పడుతుందో గ్రహించడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. అనవసరమైన ఆందోళనలను పరిమితి చేసుకోవాలి. కష్టమైన విషయాలను పూర్తిగా వదిలేయమని కాదు, వాటిని ఒక పద్ధతి ప్రకారం స్వీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీక్షిత్ లాంటి వారు తమకు కావలసిన సమాచారాన్ని పొందుతూనే, మానసిక ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భావోద్వేగ సమతుల్యత అంటే ప్రజా జీవితం నుంచి తప్పుకోవడం కాదు, స్పష్టంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కాపాడుకోవడమే.

