ఒంట్లో ఏదో అన్-ఈజీగా ఉంది… బహుశా అలసటే కావచ్చని మనలో చాలామంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న అనుభూతి వెనుక ప్రాణాపాయ పరిస్థితి దాగి ఉండొచ్చు. జర్నలిస్ట్ పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందడం ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
ముంబైలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పల్స్ ఆగిపోయినట్లు జర్నలిస్ట్ శీలా భట్ చెబుతున్నారు.
నిజానికి పల్స్ ఆగిపోవడం అనేది కార్డియాక్ అరెస్ట్ పరిస్థితికి అనుగుణంగా ఉండొచ్చు. అంటే గుండె ఒక్కసారిగా శరీరమంతా రక్తాన్ని పంప్ చేయడం ఆపేయడం. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండూ ఒకటే కాదు. హార్ట్ అటాక్ వల్ల కొన్ని సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ సంభవించొచ్చు. అయితే ఈ ఘటనలో మనం గమనించాల్సిన అసలు విషయం ఆమెకు మొదటగా వచ్చిన అసౌకర్యం. ఎందుకంటే ఒంట్లో అసౌకర్యంగా అనిపించడం అంటే ప్రతిసారీ ప్రమాదమే అని అర్థం కాదు.
డీహైడ్రేషన్, ఒత్తిడి, నిద్రలేమి, అలసట, ఇన్ఫెక్షన్ వంటి సాధారణ కారణాల వల్ల కూడా అలా అనిపించొచ్చు. కానీ అకస్మాత్తుగా ఎప్పుడూ లేని విధంగా అసౌకర్యంగా అనిపించడం, అది తగ్గకుండా కొనసాగడం లేదా దానితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపించడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడని విషయం. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యల్లో ఛాతీలో తీవ్రమైన నొప్పి మాత్రమే కనిపించాల్సిన అవసరం లేదు.
ఛాతీపై ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, వాంతులు లేదా వికారంగా అనిపించడం, అసాధారణంగా నీరసంగా మారడం, విపరీతంగా చెమటలు పట్టడం, చేతులు, మెడ, దవడ, వెన్ను ప్రాంతాల్లో అసౌకర్యం వంటివి కూడా హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
ముఖ్యంగా మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు కొన్నిసార్లు ఛాతీ నొప్పి కంటే అసాధారణ అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం లేదా వెన్ను, భుజాల్లో అసౌకర్యం రూపంలో కనిపించవచ్చు. అందుకే ఒంట్లో ఏదో సరిగ్గా లేదనే అనుభూతిని కేవలం టెన్షన్ వల్ల వచ్చిందని, అలసట వల్ల వచ్చిందని మనకు మనమే నిర్ణయించుకోవడం ప్రమాదకరం. తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, ఛాతీలో అసౌకర్యం, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, స్పందించకపోవడం లేదా సాధారణంగా శ్వాస తీసుకోకపోవడం కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
కార్డియాక్ అరెస్ట్‌లో ప్రతి నిమిషం కీలకమే. అవసరమైన సమయంలో సీపీఆర్, అందుబాటులో ఉంటే ఏఈడీ వంటి పరికరాలతో చికిత్స అందించడం ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇదే అప్రమత్తత మెదడుకు సంబంధించిన సమస్యల విషయంలోనూ అవసరం. ఒక్కసారిగా ముఖం ఒక వైపు వాలిపోవడం, ఒక చేతిలో బలహీనత లేదా మొద్దుబారడం, మాట సరిగ్గా రాకపోవడం, అకస్మాత్తుగా చూపులో మార్పు, నడకలో బ్యాలెన్స్ కోల్పోవడం లేదా కారణం తెలియని తీవ్రమైన తలనొప్పి వస్తే స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరికగా చూడాలి.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సమయం వృథా చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి. పాయల్ మెహతాకు గతంలో స్వల్ప స్థాయిలో స్ట్రోక్ వచ్చినట్లు ఆమెకు నివాళులు అర్పిస్తూ వచ్చిన కొన్ని కథనాల్లో ప్రస్తావించారు. అయితే ఆ పాత స్ట్రోక్‌కి ఆమె ప్రస్తుత మరణానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయినప్పటికీ గతంలో స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల్లో భవిష్యత్తులో మరో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే కొత్తగా కనిపించే నాడీ సంబంధిత లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని గుర్తుపెట్టుకోండి.

