LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..

Los Angels Wildfires

Los Angels Wildfires

ఒక నగరం మంటల్లో చిక్కుకుంది. ఇళ్లు కాలి బూడిదయ్యాయి. వాహనాలు కరిగిపోయాయి. ఆకాశమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఆరిపోయిన తర్వాత కూడా ఆ నగరాన్ని మరో ప్రమాదం వెంటాడింది. కంటికి కనిపించని విషం గాలిలో కలిసిపోయింది. ఆ గాలిని పీల్చుకున్నది ఒక్కరో ఇద్దరో కాదు. ఏకంగా 70 లక్షల మంది.

2025 జనవరిలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను కుదిపేసిన కార్చిచ్చు సృష్టించిన భయానక పరిణామాలివి. ఈ మంటలు అడవులకే పరిమితం కాలేదు. జనావాసాల్లోకి చొచ్చుకెళ్లి ఇళ్లు, వాహనాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను దహించేశాయి. వాటి నుంచి వెలువడిన విషపూరిత పదార్థాలు పొగతో కలిసి వాతావరణంలోకి చేరాయి.

కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణ స్థాయితో పోలిస్తే ఈ కార్చిచ్చు పొగలో సీసం స్థాయులు ఏకంగా 80 రెట్లకు పైగా పెరిగాయి. ఆర్సెనిక్ మూడు రెట్లు అధికంగా ఉంది. క్లోరిన్, బ్రోమిన్ స్థాయులు ఏడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఈటన్ ఫైర్ నుంచి వెలువడిన పొగలో విషపూరిత లోహాల సాంద్రత ప్రమాదకరంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ అసలు భయం మంటల్లో లేదు. ఆ మంటలు వదిలిన గాలిలో ఉంది. సీసం అనే విషపూరిత లోహం మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లల్లో మెదడు ఎదుగుదలను దెబ్బతీసి, ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.

పెద్దల్లో అధిక రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇక ఆర్సెనిక్‌కు కొన్ని రకాల క్యాన్సర్లతో సంబంధం ఉంది. అయితే ఇంత తక్కువ సమయంలో అత్యధిక స్థాయిలో ఈ పదార్థాలకు గురికావడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడిందనే విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. ఈ అధ్యయనం లక్షలాది మంది విషపూరిత కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతోంది. వారిలో ఎంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చాయో మాత్రం నిర్ధారించలేదు. ఈ పరిశోధన మరో ప్రమాదకరమైన వాస్తవాన్ని గుర్తుచేస్తోంది. కార్చిచ్చు అంటే కేవలం చెట్లు, గడ్డి కాలిపోవడం మాత్రమే కాదు. మంటలు జనావాసాల్లోకి చేరినప్పుడు అవి వదిలే పొగ మరింత ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమంగా మారుతుంది.

ఇక మంటలు ఒక ప్రాంతాన్ని దహించవచ్చు. కానీ ఆ పొగ ప్రయాణం మాత్రం అక్కడితో ఆగిపోదు. మంటలకు మైళ్ల దూరంలో ఉన్న మనుషుల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరవచ్చు. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనుషులు ఇళ్లను ఖాళీ చేస్తారు. మరి కంటికి కనిపించకుండా వెంటాడే విషపూరిత పొగ నుంచి ఎలా తప్పించుకోవాలి? అదే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద ప్రశ్న.