ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి ఎంత గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా.. యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించే పరిస్థితి అమెరికాకు లేదు. పైకి మాత్రం ఇరాన్ ఒప్పందం కోసం వేడుకుంటోందని చెబుతూనే… సైనిక దాడుల బెదిరింపులకు దిగుతున్నారు. అమెరికా వైఖరి ఎలా ఉన్నా…. ఇరాన్ మాత్రం మరింత స్ట్రాంగ్‌గా బదులిచ్చేందుకు రెడీ అవుతోంది. వాషింగ్టన్ తో నిరంతర ఘర్షణకు సొంత వ్యూహాన్ని రచిస్తోంది. కేవలం రక్షణాత్మక చర్యలే కాకుండా శత్రు ముప్పును తిప్పికొట్టేలా అఫెన్సివ్ ఆపరేషన్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం గడువు ముగియడం, హార్ముజ్ జలసంధి నియంత్రణపై వివాదం కొనసాగుతుండటంతో ఇరాన్ ఈ దూకుడు పెంచింది. తాము ఇప్పుడు అమెరికా నుంచి రాయితీలు రాబట్టేంత బలమైన స్థితిలో ఉన్నామని ఇరాన్ సైనికాధికారులు భావిస్తున్నారు.
సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పేరిట గత వారం ఇరాన్ భద్రతా నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అమెరికా నుంచి రాయితీలు పొందాలంటే పోరాటం కొనసాగించడం, ట్రంప్‌పై ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త అధిపతి మొహ్సేన్ రెజాయ్ స్పష్టం చేశారు. శత్రు భూభాగంలో కూడా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యాన్ని ఐఆర్‌జీసీ అభివృద్ధి చేస్తోంది. అవసరమైనప్పుడు శత్రువుల గడ్డపైనే తెలివిగా దాడులు చేయాలని నిర్ణయించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. క్లస్టర్ వార్‌హెడ్‌లతో కూడిన చురుకైన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల వినూత్న వాడకం ద్వారా కొత్త తరహా దాడులకు సిద్ధమవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న చమురు ట్యాంకర్లపై దాడులు చేయడం ఈ అఫెన్సివ్ డాక్ట్రిన్‌లో ఒక భాగం. గత కొన్ని వారాల్లో యూఏఈకి చెందిన బహుళ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు జరిగాయి. మరోవైపు యెమెన్.. ఇరాక్ తదితర ప్రాంతాల్లోని మిత్రపక్షాలను ఇరాన్ సమీకరిస్తోంది. యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు సౌదీ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశారు.
ఈ ప్రాంతీయ పోరుకు ఇరాక్ కేంద్రంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల కొంతమేర నష్టపోయినప్పటికీ ప్రాంతీయంగా ఉన్న తమ ప్రాక్సీ గ్రూపుల మద్దతును ఇరాన్ వదులుకునే అవకాశం లేదు. ఇరాన్ తన మిత్రపక్షాలతో కలిసి దాడికి దిగితే సౌదీ అరేబియా మూడు వైపుల నుంచి ముప్పు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్ కొత్త సైనిక నాయకత్వం ప్రధాన లక్ష్యం… కేంద్రీకృత కమాండ్‌తో చురుకైన యుద్ధ యంత్రాంగాన్ని నిర్మించడం. కేవలం తమను తాము కాపాడుకోవడానికే పరిమితం కాకుండా తమ క్షిపణి… డ్రోన్ సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని ఇరాన్ బలంగా విశ్వసిస్తోంది.

