IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!

Climate Change Explained

Climate Change Explained

ప్రపంచం వాతావరణం మారిపోతోంది. ఎక్కడ చూసినా భరించలేనంత వేడి, అడవుల్లో కార్చిచ్చులు. హిమాలయాల్లో మంచు కూడా వేగంగా కరుగుతోన్న పరిస్థితి. ఇంతకీభూమికి ఏమవుతోంది? రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా మారొచ్చు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలను ఒకచోట చేర్చి, ఒక పెద్ద నివేదిక తయారు చేస్తారు. దాని పేరే IPCC వాతావరణ నివేదిక. ఇప్పుడు ఈ నివేదిక ఎప్పుడు రావాలనే విషయంపైనే ప్రపంచ దేశాల మధ్య చర్చ జరుగుతోంది.

IPCC అంటే వాతావరణ మార్పులపై పరిశోధనలను సమీక్షించే ఐక్యరాజ్యసమితి సంస్థ. ఇది సొంతంగా పరిశోధనలు చేయడం కంటే, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలను పరిశీలించి, వాటి ఆధారంగా వాతావరణ మార్పుల గురించి స్పష్టమైన అంచనాలను అందిస్తుంది. భూమి ఎందుకు వేడెక్కుతోంది? దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? ఆ నష్టాలను తగ్గించడానికి ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ నివేదికలో ఉంటాయి.

ఇప్పుడు ఈ సంస్థ ఏడో నివేదికను సిద్ధం చేస్తోంది. 2028 నాటికి నివేదిక అందుబాటులోకి రావాలనే లక్ష్యంపై భారత్, చైనా, సౌదీ అరేబియా, రష్యా, కెన్యా లాంటి దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ పరిశోధనలను అందించడానికి, శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో పాల్గొనడానికి మరింత సమయం కావాలని అవి కోరుతున్నాయి. అయితే ఈ నివేదిక ఆలస్యమైతే అంతర్జాతీయ వాతావరణ చర్చలకు అవసరమైన సమాచారం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడు విడుదల చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఈ నివేదిక తయారీ అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఎంపిక చేస్తారు. వారు వాతావరణ మార్పులపై ఇప్పటికే ప్రచురితమైన వేలాది పరిశోధనలను చదివి, అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తారు.

ఒక బృందం భూమి ఎందుకు వేడెక్కుతోందో పరిశీలిస్తే, మరో బృందం ఆ మార్పుల వల్ల ప్రజలకు, ప్రకృతికి కలిగే నష్టాలను అంచనా వేస్తుంది. ఇంకో బృందం ఈ సమస్యను తగ్గించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన నివేదికను ఇతర నిపుణులు, ప్రభుత్వాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. అందులోని సమాచారంపై వేల సంఖ్యలో ప్రశ్నలు, అభ్యంతరాలు రావచ్చు. ప్రతి అంశాన్నీ పరిశీలించి, వచ్చిన సందేహాలకు సమాధానాలు ఇవ్వాలి. ఏదైనా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా ఎందుకు అంగీకరించడం లేదో వివరించాలి. ఇలా అనేక దశల్లో సమీక్ష జరిగిన తర్వాతే నివేదిక తుది రూపు దాలుస్తుంది.

మరి ఇంత కష్టపడి తయారు చేసే నివేదికతో ఉపయోగం ఏమిటి? ఉదాహరణకు, ఒక ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోందని పరిశోధనలు చెబితే, ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తం కావచ్చు.

రైతులకు, తీర ప్రాంత ప్రజలకు, పర్వత ప్రాంతాల్లో నివసించే వారికి ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేసి రక్షణ చర్యలు చేపట్టవచ్చు. కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఈ నివేదికలోని సమాచారం ఉపయోగపడుతుంది. భారత్‌కు ఇది మరింత ముఖ్యం. ఎందుకంటే వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయం నుంచి నీటి లభ్యత వరకు, తీర ప్రాంతాల నుంచి హిమాలయాల వరకు అనేక రంగాలపై పడుతుంది. భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ నివేదికల తయారీలో పాల్గొంటున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జరిగే చర్చల్లో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటు మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. IPCC నివేదికలు ప్రమాదాలను వివరిస్తాయి, వాటిని ఎదుర్కోవడానికి మార్గాలను చూపిస్తాయి.

కానీ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశించలేవు. ఆ నిర్ణయం ఆయా దేశాల ప్రభుత్వాలదే. అంటే ప్రమాదం గురించి ప్రపంచానికి స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉన్నా, దాన్ని పట్టించుకుని చర్యలు తీసుకుంటారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని ఎదుర్కోవడానికి ఇప్పుడే పనిచేయడం కూడా అంతే ముఖ్యం.