Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?

Delimitation Gerrymandering

Delimitation Gerrymandering

Delimitation 2026: దేశ రాజకీయాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం పెను చర్చకు దారితీస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సవరించిన ప్రతిపాదన కొంతవరకు తగ్గించినప్పటికీ.. అసలు వివాదం మాత్రం మరో మలుపు తిరిగింది. దేశంలో ఎన్ని సీట్లు పెరుగుతాయన్నది ఒక ఎత్తయితే.. ఆ సీట్లకు సంబంధించిన నియోజకవర్గాల సరిహద్దులను ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఆ ప్రక్రియలో అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపాదిత డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను బీజేపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం జరగవచ్చని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో సీట్ల పెంపు చుట్టూ మొదలైన చర్చ కాస్తా.. దేశ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించే రాజకీయ పోరుగా మారుతోంది.

ప్రతిపక్షాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలి: రాహుల్

శనివారం (నవంబర్ 28) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం ద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ఈ ప్రక్రియను ఉపయోగించుకునే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రతిపక్షాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని, అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులతో కూడిన ద్వైపాక్షిక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాని మోడీ ఖాళీ చెక్ కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేవలం సీట్ల సంఖ్య పెంచడం వల్ల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం మెరుగుపడదని, వాటి సరిహద్దుల రూపకల్పనలోనూ పారదర్శకత, నిష్పాక్షికత అవసరమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

తెరపైకి జెర్రీమాండరింగ్..
ఇక్కడే జెర్రీమాండరింగ్ (Gerrymandering) అనే అంశం తెరపైకి వస్తోంది. సులభంగా చెప్పాలంటే.. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా లేదా ప్రత్యర్థి పార్టీలకు మద్దతిచ్చే ఓటర్ల ప్రభావాన్ని తగ్గించేలా నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడాన్నే జెర్రీమాండరింగ్ అంటారు. ఈ పదం 1812లో అమెరికాలో పుట్టింది. అప్పట్లో మసాచుసెట్స్ గవర్నర్ ఎల్‌బ్రిడ్జ్ గెర్రీ ఆమోదించిన ఓ ఎన్నికల జిల్లా ఆకారం సాలమాండర్ అనే ఉభయచర జీవిని పోలి ఉందని ఓ వ్యంగ్య చిత్రం ప్రచురితమైంది. గెర్రీ పేరులోని ‘గెర్రీ’, సాలమాండర్‌లోని ‘మాండర్’ పదాలను కలిపి ‘జెర్రీమాండర్’ అనే పదాన్ని సృష్టించారు. అప్పటి నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మలచే ప్రక్రియకు ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే తరహా రాజకీయ ప్రయోగం జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడంపై మాత్రమే కాదు. ఆ సీట్లను ఏ ప్రాంతాల్లో, ఎలాంటి భౌగోళిక విభజనతో ఏర్పాటు చేస్తారన్నదే అసలు సమస్య. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో పాటు ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఈ ప్రతిపాదనను సమర్థించారు. సీట్ల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు శాసనసభల్లో మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందని, మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు, గొంతు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

గతంలో జెర్రీమాండరింగ్ జరిగిందా?
అయితే మరోవైపు.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య జెర్రీమాండరింగ్ ఆరోపణలను కొట్టిపారేశారు. నియోజకవర్గాల సరిహద్దులను ప్రభుత్వం నేరుగా నిర్ణయించదని, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ ఈ బాధ్యతను నిర్వహిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలను ప్రస్తావిస్తూ.. అప్పటి పునర్విభజనలో జెర్రీమాండరింగ్ జరిగిందని కాంగ్రెస్ భావిస్తోందా? అని ప్రశ్నించారు. మరోవైపు న్యాయవాది నవ్రూప్ సింగ్ (Advocate Navroop Singh) కూడా కమిషన్ స్వతంత్రతకు మద్దతుగా మాట్లాడారు. ఇందులో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ప్రాతినిధ్యం ఉంటుందని, కమిషన్ నిర్ణయాలు సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధిలో ఉంటాయని వివరించారు.

ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం ఇదే..
నవంబర్ 27న కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన ప్రతిపాదన ప్రకారం.. 2051 వరకు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాతినిధ్య వాటాను యథాతథంగా కొనసాగిస్తూ లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్ల సంఖ్యను సుమారు 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన చట్టాన్ని నవంబర్ 30న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో గతంలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ ప్యాకేజీకి అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో.. అప్పట్లో వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ కొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రాలకు దాదాపు 50 శాతం అదనపు సీట్లు లభిస్తాయి. అయితే ఆ అదనపు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సరిహద్దులను మార్చక తప్పదు. ఇక్కడే ప్రతిపక్షాలు తమ ప్రధాన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అస్సాంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియే ఉదాహరణ: ప్రతిపక్షాలు..
అస్సాం రాష్ట్రంలో 2023లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రతిపక్షాలు ఉదాహరణగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 2023లో అస్సాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో డింగ్, రుపోహిహాట్, సమాగురి అనే మూడు ముస్లిం ప్రాబల్య అసెంబ్లీ సెగ్మెంట్లను కలియాబోర్ నుంచి నాగావ్ ప్రాంతంలోకి మార్చారు. నాగావ్‌లో అప్పటికే ముస్లిం జనాభా అధికంగా ఉంది. అదే సమయంలో బార్హంపూర్, హోజాయ్, లుమ్డింగ్ వంటి బీజేపీకి అనుకూలంగా భావించే మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను కొత్తగా ఏర్పాటైన కజిరంగా నియోజకవర్గంలో చేర్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కజిరంగా స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, నాగావ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పరిణామాలను చూపిస్తూ.. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య మారకపోయినా, నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవని కాంగ్రెస్ వాదిస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. కేవలం సీట్ల సంఖ్య పెరగడం కంటే జెర్రీమాండరింగ్ ప్రమాదమే మరింత తీవ్రమైనదని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఎన్నికల మ్యాప్‌ను రూపొందించే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందన్నది అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ హర్మీత్ కౌర్ కూడా స్పష్టమైన రక్షణలు, పారదర్శకమైన విధానాలు లేకపోతే డీలిమిటేషన్ ప్రజాస్వామ్య ప్రక్రియ కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే సాధనంగా మారుతుందని హెచ్చరించారు. అస్సాం 2023 అనుభవమే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.

ఈ వ్యవస్థ నిజంగా స్వతంత్రంగా పనిచేస్తుందా?
ప్రతిపాదిత డీలిమిటేషన్ కమిషన్ నిర్మాణం కూడా ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం, కమిషన్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రస్తుత లేదా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. సవరించిన బిల్లులోని సెక్షన్ 5(4) ప్రకారం అసోసియేట్ సభ్యులుగా ఎంపికయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు కమిషన్‌కు సహకరిస్తారు. అయితే వారికి నిర్ణయాలపై ఓటు హక్కు ఉండదు. అంతేకాకుండా కమిషన్ చైర్‌పర్సన్‌ను కేంద్ర ప్రభుత్వమే నియమించనుండటంతో.. ఈ వ్యవస్థ నిజంగా స్వతంత్రంగా పనిచేస్తుందా? అన్న ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. తమకు అభ్యంతరాలున్నప్పటికీ వాటిని నిర్ణయించే ప్రక్రియలో తగిన పాత్ర ఉండదని ఆందోళన చెందుతున్నాయి.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యంగ్యాస్త్రాలు..

ఈ అంశంపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి కూడా నవంబర్ 27న ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. డీలిమిటేషన్ కమిషన్ చైర్‌పర్సన్ ఒక మహిళ అయితే బాగుంటుందని, ఆమెకు జెర్రీమాండరింగ్‌లో నైపుణ్యం ఉంటే మరీ మంచిదని వ్యాఖ్యానించారు. అదే రోజు కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. గతంలో ఈ ప్రతిపాదనను ఓడించినట్లుగానే మరోసారి సమష్టిగా పోరాడి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 17న జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు జరిగాయని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే తరహా ప్రయత్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు: కాంగ్రెస్
మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపైనా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం ఇప్పటికే ఆమోదం పొందినప్పటికీ, మోడీ-అమిత్ షా ప్రభుత్వం దానిని మూడేళ్లకు పైగా అమలు చేయకుండా నిలిపివేసిందని జైరాం రమేష్ నవంబర్ 27న విమర్శించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కరుణా నంది కూడా మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌కు అనుసంధానించడాన్ని ‘ట్రోజన్ హార్స్’తో పోల్చారు. అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ఒక మంచి లక్ష్యాన్ని ముందుపెట్టి, దాని వెనుక మరో వివాదాస్పద ఉద్దేశాన్ని అమలు చేసే వ్యూహంగా ఆమె అభివర్ణించారు.

రాజ్యాంగాన్ని మర్చడమే ప్రధాన లక్ష్యం: గౌరవ్ గోగోయ్
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ మరో అడుగు ముందుకేసి.. పార్లమెంట్‌లో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలన్నది బీజేపీ అసలు లక్ష్యమని ఆరోపించారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జీవితాంతం అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, జనాభా ఆధారంగా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ప్రతిపాదనపై ఎన్డీయేకు వెలుపల ఉన్న అన్ని పార్టీలు ఒకే వైఖరితో లేవు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి గతంలో ఉన్న ఆందోళనలను తగ్గించేలా సీట్ల పెంపు ఫార్ములా రూపొందించడంతో కొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వంటి ఎన్డీయేతర పార్టీలు సవరించిన ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి. దీంతో డీలిమిటేషన్ అంశంపై ప్రతిపక్షాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకూడదన్న ఆందోళన ఉండగా, మరోవైపు నియోజకవర్గాల సరిహద్దుల మార్పు ద్వారా ఎన్నికల సమీకరణాలు మారిపోతాయన్న భయం నెలకొంది.

2002 నుంచి 2008 మధ్య జరిగిన గత డీలిమిటేషన్ ప్రక్రియ..
ఇదిలా ఉంటే, డీలిమిటేషన్‌లో జెర్రీమాండరింగ్ జరిగిందని కేవలం నియోజకవర్గాల ఆకారాలను చూసి నిర్ధారించలేమని డేటా విశ్లేషణలు సూచిస్తున్నాయి. 2002 నుంచి 2008 మధ్య జరిగిన గత డీలిమిటేషన్ ప్రక్రియను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ ఛైర్‌పర్సన్‌గా, బీబీ టాండన్ సభ్యుడిగా వ్యవహరించారు. అయితే ఆ కమిషన్ సిఫార్సులు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఖరారై, 2008లో అమల్లోకి వచ్చాయి. అంటే డీలిమిటేషన్ ప్రక్రియ ఒక ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, మరో ప్రభుత్వం సమయంలో పూర్తయిన సందర్భం అది.

2008 లోక్‌సభ నియోజకవర్గాల భౌగోళిక ఆకారాల పరిశీలన..

ఓ ప్రముఖ డేటా అనలిస్ట్ 2008లో అమల్లోకి వచ్చిన లోక్‌సభ నియోజకవర్గాల భౌగోళిక ఆకారాలను పరిశీలించారు. నియోజకవర్గం ఆకారం ఎంత సహజంగా, భౌగోళికంగా అనుసంధానమై ఉందో అంచనా వేయడానికి ‘కాన్వెక్స్ హల్’ (Convex Hull) అనే గణిత కొలమానాన్ని ఉపయోగించారు. ఒక ప్రాంతాన్ని చుట్టుముట్టే కనీస కుంభాకార ఆకృతితో పోలిస్తే ఆ నియోజకవర్గం ఎంత విస్తీర్ణాన్ని ఆక్రమించిందన్నది ఈ కొలమానం ద్వారా అంచనా వేస్తారు. 2019లో చేసిన పరిశోధనలో అస్సాంలోని అప్పటి కలియాబోర్ నియోజకవర్గం తన చుట్టూ ఏర్పడే కనీస కాన్వెక్స్ హల్ విస్తీర్ణంలో కేవలం 39 శాతం మాత్రమే ఆక్రమించిందని శశిధర్ గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ నిష్పత్తి సగటున 72 శాతంగా ఉందని, బెంగళూరు నార్త్ నియోజకవర్గంలో ఇది సుమారు 51 శాతంగా ఉందని ఉదాహరణలతో వివరించారు. అయితే నియోజకవర్గాల ఆకారాలు అసాధారణంగా ఉండటం ఒక్కటే రాజకీయ జెర్రీమాండరింగ్‌కు ఆధారంగా పరిగణించలేమని పరిశీలనలు సూచిస్తున్నాయి.

అస్సాంలో జెర్రీమాండరింగ్ జరిగిందని తేల్చడం సాధ్యం కాదు..
మరోవైపు ఓ జాతీయ మీడియా ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ ప్రకారం.. 2023లో అస్సాంలో జరిగిన డీలిమిటేషన్‌లో మొత్తం 126 అసెంబ్లీ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదు. అయినప్పటికీ ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. పునర్విభజనకు ముందు సుమారు 35గా ఉన్న ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలు.. ఆ తర్వాత 22 నుంచి 24 మధ్యకు తగ్గినట్లు జాతీయ మీడియా విశ్లేషణ పేర్కొంది. అయితే జనాభా పంపిణీ, భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాల ఆకారాల్లో వచ్చిన మార్పులను సమగ్రంగా పరిశీలించకుండా ఈ సంఖ్యల ఆధారంగా మాత్రమే ఉద్దేశపూర్వక రాజకీయ జెర్రీమాండరింగ్ జరిగిందని తేల్చడం సాధ్యం కాదని విశ్లేషకుల అభిప్రాయం.

న్యాయపరమైన రక్షణలు ఉన్నాయ్..
డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలకు సంబంధించి న్యాయపరమైన రక్షణలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(a) ప్రకారం డీలిమిటేషన్ చట్టాలు, వాటి కింద చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను సాధారణంగా కోర్టుల్లో సవాలు చేయడంపై ఆంక్షలు ఉంటాయి. అయితే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినా, చట్టం కల్పించిన అధికారాలను మించి కమిషన్ వ్యవహరించినా న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2024లో కిశోర్‌చంద్ర ఛంగాన్‌లాల్ రాథోడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉండే, స్పష్టంగా ఏకపక్షంగా తీసుకున్న ఉత్తర్వులను న్యాయస్థానాలు పరిశీలించవచ్చని పేర్కొంది. న్యాయ జోక్యానికి పూర్తిగా తలుపులు మూసేస్తే పౌరులు డీలిమిటేషన్ కమిషన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అయితే.. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే సమయంలో జనాభా, భౌగోళిక సామీప్యం, భౌతిక స్వరూపాలు, పరిపాలనా సరిహద్దులు, ప్రజల సౌకర్యం వంటి అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలి. అంటే రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా నియోజకవర్గాలను విభజించడానికి చట్టం అనుమతించదు. అయితే న్యాయ సమీక్ష పరిధి పరిమితంగా ఉండటం, ప్రతి నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోవడం వంటి అంశాలు ప్రతిపక్షాల ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

బీజేపీ వాదన ఇదే..
ఇక బీజేపీ వాదన మరోలా ఉంది. ఇంకా ఎలాంటి నియోజకవర్గాల సరిహద్దులనూ మార్చలేదని, ఇప్పుడే జెర్రీమాండరింగ్ జరిగిపోతుందని ఆరోపించడం పూర్తిగా ఊహాజనితమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిషన్, ఎన్నికల సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యం, న్యాయ సమీక్ష వంటి రక్షణలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. సీట్ల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం లభించడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఏర్పడుతుందని, జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గుతుందన్న ఆందోళనలను కూడా కొత్త ఫార్ములా పరిష్కరిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది.

మొత్తానికి, భారతదేశంలో డీలిమిటేషన్ చర్చ ఇప్పుడు కేవలం లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు దగ్గర ఆగడం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటర్లకు ప్రాతినిధ్యం కల్పించే ఎన్నికల మ్యాప్‌ను రూపొందించే అధికారం ఎవరికి ఉండాలి? ఆ ప్రక్రియలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి పాత్ర ఉండాలి? నియోజకవర్గాల సరిహద్దులు రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉంటాయన్న నమ్మకాన్ని ఎలా కల్పించాలి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. సీట్ల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకపోవచ్చని కేంద్రం చెబుతున్నప్పటికీ, సరిహద్దుల మార్పు ద్వారా ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రతిపక్షాలు అంటున్నాయి. న్యాయ సమీక్ష ఉన్నప్పటికీ అది ఎంతవరకు సమర్థవంతమైన రక్షణగా నిలుస్తుందన్నది మరో ప్రశ్న. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌లో అసలు పరీక్ష సీట్ల సంఖ్యను పెంచడం కాదు.. ఆ సీట్లను ఎంత నిష్పాక్షికంగా, పారదర్శకంగా విభజిస్తారన్నదే. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నది ఓటర్లు నిర్ణయించాలి తప్ప.. ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉండాలన్నది రాజకీయ ప్రయోజనాలు నిర్ణయించకూడదు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేయగల ఈ ప్రక్రియలో ఇదే అత్యంత కీలకమైన అంశం.