Delimitation Explained: నిన్నటి వరకు అసాధ్యం అనుకున్నది.. ఇవాళ సుసాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు అధికార పక్షానికి వరంగా మారాయి. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ సర్కార్ సంచలనాలకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన.. మహిళా రిజర్వేషన్లు.. జమిలి ఎన్నికల లాంటి కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు మోదీ సర్కార్ కేవలం కొన్ని ఓట్ల దూరంలోనే మిగిలింది. ఆ మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ ఎలా సాధించబోతోంది? విపక్షాల నుంచి అధికార పక్షంలోకి జంప్ చేస్తున్న ఆ ఎంపీలు ఎవరు? అసలు పార్లమెంట్‌లో ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయి…?
ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంట్ సాక్షిగా విపక్షాలు తమ సత్తా చాటాయి. మహిళా రిజర్వేషన్ల ప్యాకేజీలో భాగంగా తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు సమైక్యంగా అడ్డుకున్నాయి. నాడు లోక్‌సభలో కేవలం 54 ఓట్ల తేడాతో అధికార పక్షం ఈ బిల్లును పాస్ చేసుకోలేకపోయింది. అప్పట్లో ప్రతిపక్షాల ఐక్యత చూసి ఎన్డీఏ వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ గత రెండు వారాల్లో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నెల రోజుల క్రితం ఎవరూ ఊహించని విధంగా విపక్ష కూటమిలో భారీ చీలికలు వస్తున్నాయి. నాడు ఆగిపోయిన బిల్లును ఇప్పుడు మళ్లీ సభ ముందుకు తీసుకొస్తే.. ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
NDAకు బలాన్ని ఇచ్చిన టీఎంసీ:
అధికార ఎన్డీఏ కూటమికి ఈ అదనపు బలం పశ్చిమ బెంగాల్ నుంచి వస్తోంది. మే 4న జరిగిన పరిణామాలతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ పార్టీ ప్రతి స్థాయిలోనూ కుప్పకూలుతోంది. ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చీలగా.. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా పార్లమెంట్‌పై పడింది. తృణమూల్ కాంగ్రెస్‌కు లోక్‌సభలో 28 మంది ఎంపీలు ఉంటే… వారిలో ఏకంగా 20 మంది ఎంపీలు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరంతా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే చిన్న పార్టీలో చేరిపోయారు. బెంగాల్‌లో రిజిస్టర్ అయిన ఈ పార్టీ గతంలో త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా విఫలమైంది. కానీ ఇప్పుడు టీఎంసీ రెబల్స్ రాకతో ఈ పార్టీ నేరుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడమే కాదు.. ఏకంగా ఎన్డీఏ కూటమిలో అధికారికంగా భాగం కాబోతోంది.
ఉద్ధవ్ వర్గం చీలిపోనుందా?
బెంగాల్‌లోనే కాదు మహారాష్ట్రలోనూ విపక్ష కూటమికి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ పార్టీ కూడా అచ్చం తృణమూల్ కాంగ్రెస్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఏక్ నాథ్ షిండే వర్గం శివసేనలో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ నేరుగా ఎన్డీఏకే లాభం చేకూర్చనున్నాయి. రాబోయే వర్షాకాల సమావేశాల నాటికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని ఎన్డీఏ దాదాపుగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకసారి లోక్‌సభ లెక్కలు విశ్లేషిస్తే….సభలో మొత్తం 543 స్థానాలుండగా.. ప్రస్తుతం మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ మార్క్ 360కి చేరింది. టీఎంసీ రెబల్స్ తో కలుపుకుంటే ప్రస్తుతం ఎన్డీఏ బలం 318గా ఉంది. ప్రతిపక్షాల బలం 184కి పడిపోయింది. ఏ పక్షానికీ మద్దతు ఇవ్వని ఎంపీలు 38 మంది ఉన్నారు. అయితే ఓటింగ్ సమయంలో సభలో హాజరైన సభ్యుల సంఖ్యను బట్టి ఈ మెజారిటీ మారుతుంది. గత బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టినప్పుడు 540 మందికి 528 మందే హాజరయ్యారు. ఆ లెక్కన నాడు మెజారిటీ మార్క్ 352 కాగా.. ఎన్డీఏకు 298 ఓట్లు వచ్చాయి. అంటే 54 ఓట్లు తక్కువ పడ్డాయి. ఇప్పుడు టీఎంసీ నుంచి 20 మంది.. శివసేన నుంచి 6 ఎంపీలు వస్తే 26 ఓట్లు కవర్ అవుతాయి. ఇంకోవైపు కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఎంకే స్టాలిన్‌తో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. డీఎంకే డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తే.. ఆ పార్టీకి ఉన్న 22 మంది ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు దక్కుతుంది. దీంతో మొత్తం బలం 348కి చేరుతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 6 ఓట్లు మాత్రమే తక్కువ అవుతాయి.
లోక్‌సభలో తక్కువైన ఆ ఆరు ఓట్లను ఎలా సాధించాలనే దానిపై బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. ఎన్డీఏ కన్ను సమాజ్‌వాదీ పార్టీపై పడినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎస్పీలో చీలికలు తీసుకురావడం అంత సులభం కాదు. అందుకే ఇండియా కూటమిలో ఉన్న మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల చిన్న పార్టీల ఎంపీలతో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. ఇక రాజ్యసభ లెక్కలు చూస్తే… అక్కడ గరిష్ట బలం 250 కాగా ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ మూడింట రెండొంతుల మెజారిటీకి 164 ఓట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 150 మంది సభ్యుల బలం ఉంది. వీరికి డీఎంకేకు చెందిన 8 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు తోడైతే…బలం 158కి చేరుతుంది. ఇక్కడ కూడా కేవలం 6 ఓట్లు మాత్రమే తక్కువ అవుతాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో విజయంతో పాటు చిన్న పార్టీల మద్దతుతో రాజ్యసభలో ఆ ఆరు ఓట్ల గ్యాప్‌ను భర్తీ చేయడం ఎన్డీఏకు పెద్ద కష్టమేమీ కాదు.
పార్లమెంట్ ఉభయ సభల్లో పరిస్థితులన్నీ అనుకూలిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే యాక్షన్‌లోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణల కోసం నెలకొన్న అడ్డంకులు తొలగిపోతే…, మోడీ సర్కార్ అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏప్రిల్‌లో ఆగిపోయిన పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్లీ ప్రాణం పోస్తారు. వచ్చే నెలలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లోనే ఈ కీలక బిల్లులను సభ ముందుకు తెచ్చి ఆమోదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా ఎంతో దూరంలో లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్షాలు బలహీనపడటం ఎన్డీఏకు అనుకోని వరంలా మారుతోంది. ఈ ఆరు ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను మోదీ టీమ్ ఎలా దాటుతుందో చూడాలి.

