Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?

Crude Prices

Crude Prices

ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 10రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. అంటే ప్రపంచానికి ఇంధన ఖర్చుల విషయంలో మరోసారి గట్టి హెచ్చరిక మొదలైనట్టే. మరి ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుంది?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా? మనం కొనుక్కునే కూరగాయలు, నిత్యావసరాలపై కూడా ఈ ప్రభావం పడుతుందా? అసలు క్రూడ్ ఆయిల్ 100 డాలర్ల దగ్గర ఎక్కువకాలం ఉంటే మన ఇంటి బడ్జెట్ పరిస్థితి ఏంటి?

ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. భారత్‌కు అవసరమైన ముడి చమురులో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుంచే వస్తుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించి అదే చమురును కొనాలి.

ఈసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్ ఒక్కసారిగా పెరగడం కాదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన సరఫరా ఆందోళనలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే క్రూడ్ 100 డాలర్లు దాటిందంటే మరుసటి రోజే పెట్రోల్ బంక్‌లో ధర పెరిగిపోతుందని అర్థం కాదు. భారత్‌లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంతకాలం అంతర్జాతీయ ధరల మార్పులను తమ మార్జిన్లలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే క్రూడ్ ధరల్లో ఇంతటి కదలిక వచ్చినా దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే అదే స్థాయిలో మారాల్సిన పరిస్థితి ఉండదు. కానీ అసలు సమస్య ధర ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే మొదలవుతుంది. భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తే దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు పెరుగుతుంది. దీనివల్ల రూపాయిపై ఒత్తిడి రావచ్చు. రూపాయి బలహీనపడితే చమురును దిగుమతి చేసుకోవడం మరింత ఖరీదవుతుంది.

ఇలా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత దీని ప్రభావం రవాణా ఖర్చులపై కనిపిస్తుంది. డీజిల్ ధర పెరిగితే ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.

సరుకులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చు చివరికి వస్తువుల ధరల్లోకి చేరుతుంది. మనం మార్కెట్‌లో కొనుక్కునే కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల ధరలపై కూడా పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. విమాన ప్రయాణికులపైనా ప్రభావం ఉండొచ్చు. విమానయాన సంస్థలకు ఇంధనమే అతిపెద్ద నిర్వహణ ఖర్చుల్లో ఒకటి. విమాన ఇంధనం ధర ఎక్కువకాలం పెరిగితే ఆ భారంలో కొంత భాగం టికెట్ ధరల ద్వారా ప్రయాణికులపై పడే అవకాశం ఉంటుంది. ఇదంతా కలిపి చూస్తే క్రూడ్ ఆయిల్ కథ పెట్రోల్ బంక్ దగ్గర మొదలై అక్కడే ముగిసేది కాదని అర్థమవుతుంది.

అది రూపాయి విలువను తాకొచ్చు, దిగుమతి బిల్లును పెంచొచ్చు, రవాణా ఖర్చులను పెంచొచ్చు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రశ్న ఒక్కటే. 100 డాలర్లను దాటిందా లేదా అనేది కాదు. ఈ ధరలు ఇంకా ఎన్ని రోజులు 100 డాలర్ల పైనే కొనసాగుతాయన్నదే భారత్‌కు అసలు పరీక్ష.