Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్‌, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?

Childhood Trauma

Childhood Trauma

చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అక్కడితో ముగిసిపోయాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాల ప్రభావం మనకు తెలియకుండానే ఏళ్ల తర్వాత బయటపడొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం, కుటుంబంలో జరిగే తీవ్రమైన సమస్యలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో పాటు, వారు బాధను ఎదుర్కొనే విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్ మోంటెమయోర్ చెబుతున్నారు.

ఒక చిన్నారికి చిన్న వయసులోనే శారీరక లేదా భావోద్వేగ వేధింపులు ఎదురయ్యాయని అనుకుందాం. లేదా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, ఇంట్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటం, మద్యం లేదా ఇతర పదార్థాల వినియోగం వంటి పరిస్థితుల్లో పెరగడం జరిగిందనుకుందాం. ఇలాంటి అనుభవాలు ఆ సమయంలోనే పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ మెదడు, శరీరం అభివృద్ధి చెందుతున్న దశలో ఎదురయ్యే ఈ ఒత్తిడి భావోద్వేగాలను నియంత్రించడంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తర్వాత జీవితంలో బాధ, ఆందోళన, ఒత్తిడి వంటి భావాలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇది ప్రభావితం చేయొచ్చు.

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనకు, యువకుడిగా ఉన్నప్పుడు కనిపిస్తున్న సమస్యకు సంబంధం ఉందని ఆ వ్యక్తికే అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకు కాలేజీలో చదువుతున్న ఒక యువకుడికి అకస్మాత్తుగా నిరాశ ఎక్కువ కావచ్చు. ఎవరితోనూ కలవాలనిపించకపోవచ్చు. ఎప్పుడూ ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఆ బాధకు కారణం ఏంటో అతనికి తెలియకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఎదురైన బాల్య గాయాలు కూడా ఒక కారణంగా ఉండే అవకాశం ఉందని మోంటెమయోర్ వివరిస్తున్నారు.

ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారేది ఆ బాధను ఎదుర్కొనేందుకు మద్యం లేదా ఇతర పదార్థాలను ఆశ్రయించినప్పుడు. మొదట్లో అది సమస్యకు పరిష్కారంలా అనిపించవచ్చు. బాధగా ఉన్నప్పుడు తాగితే కొంతసేపు ఆ భావన నుంచి బయటపడినట్టు అనిపించొచ్చు. కానీ అసలు సమస్య పరిష్కారం కాకపోవడంతో మళ్లీ అదే బాధ ఎదురవుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి మళ్లీ మద్యం లేదా ఇతర పదార్థాలను ఉపయోగించే పరిస్థితి రావచ్చు. ఇలా బాల్యంలోని ప్రతికూల అనుభవాలు, డిప్రెషన్, ఆ తర్వాత పదార్థాల వినియోగం ఒకదానితో ఒకటి ముడిపడే అవకాశం ఉందని నిపుణుడు చెబుతున్నారు.

కాలేజీ వయసులో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలవుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అదే సమయంలో మద్యం వంటి పదార్థాలకు యాక్సెస్ కూడా పెరగొచ్చు. ఒకే కాలేజీలో వేలాది మంది విద్యార్థులు ఉంటారు. ప్రతి ఒక్కరి కుటుంబ నేపథ్యం, గత అనుభవాలు, ఎదుర్కొన్న సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఒకే పరిస్థితి ఇద్దరు విద్యార్థులపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం లేదని మోంటెమయోర్ చెబుతున్నారు.

బాల్యంలో ఎదురైన ప్రతి సమస్యను ఒకే రకమైన ట్రామాగా చూడలేమన్నది కూడా ఈ పరిశోధనలో ముఖ్యమైన విషయం. కొందరు శారీరక వేధింపులు ఎదుర్కొని ఉండొచ్చు. మరికొందరు భావోద్వేగ వేధింపులు లేదా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొని ఉండొచ్చు. ఇంకొందరు మానసిక ఆరోగ్య సమస్యలు లేదా మద్యం, ఇతర పదార్థాల వినియోగం ఉన్న కుటుంబాల్లో పెరిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి ఎన్ని ప్రతికూల అనుభవాలు ఎదుర్కొన్నాడన్న సంఖ్య మాత్రమే కాకుండా, అతను ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు, అది అతనిపై ఎంత ప్రభావం చూపించింది అన్నదీ ముఖ్యమే.

ముఖ్యంగా బాల్యంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం వంటి కొన్ని రకాల అనుభవాలు తర్వాతి దశలో మద్యం వినియోగ సమస్యలతో బలమైన సంబంధం కలిగి ఉండొచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయని మోంటెమయోర్ చెబుతున్నారు. అయితే ప్రతి వ్యక్తి విషయంలో ఫలితం ఒకేలా ఉండదు. ఒకరికి తీవ్రంగా ప్రభావం చూపిన అనుభవం మరొకరిపై అదే స్థాయిలో ప్రభావం చూపకపోవచ్చు.

ఈ ప్రభావం మానసిక ఆరోగ్యంతో మాత్రమే ఆగిపోదు. ఒక విద్యార్థి తన గత అనుభవాల వల్ల బాధపడుతూ, దాన్ని ఎదుర్కోవడానికి మద్యాన్ని ఉపయోగిస్తుంటే అతని చదువుపైనా ప్రభావం పడొచ్చు. క్లాసులకు గైర్హాజరు కావడం, ఆలస్యంగా రావడం, చదువుపై దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అంటే చిన్నతనంలో మొదలైన ఒక గాయం ఏళ్ల తర్వాత మానసిక ఆరోగ్యంలో కనిపించి, అక్కడి నుంచి మద్యం వినియోగానికి, చివరికి చదువు మరియు రోజువారీ జీవితానికి కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడవచ్చు.

అయితే బాల్యంలో కష్టమైన అనుభవాలు ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా డిప్రెషన్‌కు గురవుతారని లేదా మద్యం వైపు వెళ్తారని దీని అర్థం కాదు. వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులు, అతనికి లభించిన కుటుంబ మద్దతు, సామాజిక వాతావరణం, ఆ అనుభవాలను ఎదుర్కొనే విధానం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే గతంలో జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడం, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

తన జీవితంలో ఇలాంటి అనుభవాలను గుర్తించిన విద్యార్థులు లేదా యువత వాటిని ఒంటరిగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదని మోంటెమయోర్ సూచిస్తున్నారు. వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం కష్టంగా అనిపిస్తే ముందుగా బాల్యంలోని ప్రతికూల అనుభవాలు, ట్రామా గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం కీలకం. ఎందుకంటే చిన్నతనంలో జరిగినది గతంలోనే మిగిలిపోయినట్టు కనిపించినా, దాని ప్రభావం వర్తమాన జీవితంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, సరైన సహాయం తీసుకోవడం ద్వారా ఆ చక్రాన్ని ఆపే అవకాశం ఉంటుంది.