దేశాన్ని నడిపించే నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య దేవాలయం… మన ఎన్నికల సంఘం! కానీ ఆ దేవాలయ పవిత్రతపై ఇప్పుడు అనుమానాల నీడ పడింది. స్వయంప్రతిపత్తికి ప్రతీకగా ఉండాల్సిన కమిషనర్ల నియామకం ఇప్పుడు అధికార పార్టీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూర్చున్న కుర్చీలో.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చి చేరారు! అసలు ఈ మార్పు వెనుక ఏం జరిగింది? సీజేఐ నుంచి కేబినెట్ మంత్రి దాకా సాగిన ఈ ప్రయాణం మన ప్రజాస్వామ్య భవిష్యత్తును ఎటు వైపు నడిపిస్తోంది?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల సంఘం నియామక ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం… ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి. అయితే, పార్లమెంటు నిర్దిష్ట చట్టం చేసే వరకు దశాబ్దాల పాటు ఈ నియామకాలు పూర్తిగా కార్యనిర్వాహక వర్గం చేతిలోనే ఉండేవి. ప్రభుత్వమే పేర్ల ప్యానెల్ తయారు చేయడం, ప్రధాని సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పద్ధతిలో బ్యూరోక్రాట్లదే హవా ఉండేది.
అయితే ఈ సుదీర్ఘ సంప్రదాయానికి తెరదించుతూ మార్చి 2023లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు చట్టం చేసే వరకు… ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నియామకాలు చేయాలని స్పష్టం చేసింది. ఇది ఈసీ స్వయంప్రతిపత్తికి పెద్ద పీట వేస్తుందని అంతా భావించారు.
అయితే.. ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పార్లమెంటు 2023లో సరికొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్ నియామకంపై 2023లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అత్యంత కీలకమైన మార్పు జరిగింది. సుప్రీంకోర్టు కమిటీలో ఉన్న సీజేఐ స్థానాన్ని తొలగించి, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రికి స్థానం కల్పించారు.
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నామినేట్ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం… ప్రధాని చైర్‌పర్సన్ గా ఉంటారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ త్రిసభ్య కమిటీ నియామకాలను సిఫార్సు చేస్తోంది. దీనికి ముందు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ అయిదుగురితో కూడిన అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఆ జాబితాను ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. అయితే మెజారిటీ సందర్భాల్లో ప్రతిపక్ష నేత గైర్హాజరు కావడమో.. లేదంటే వ్యతిరేకించడమో జరుగుతోంది. దీంతో ప్రధానితో పాటు ఆయన నామినేట్ చేసిన మంత్రి ఏకాభిప్రాయంతో ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్నారు.
2023లో వచ్చి ఈ చట్టంపైన ప్రజాసంఘాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐని తొలగించి కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడం ద్వారా ఈసీ స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడుతోందని పిటిషనర్లు వాదించారు. సుప్రీంకోర్టు గతంలో స్పష్టంచేసిన స్వతంత్రత ఈ కొత్త చట్టంతో లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా తిప్పికొడుతోంది. సుప్రీంకోర్టు తానే స్వయంగా “పార్లమెంటు చట్టం చేసే వరకు మాత్రమే తమ మధ్యంతర కమిటీ పనిచేస్తుందని” చెప్పిందని, కాబట్టి చట్టం చేసే పూర్తి అధికారం పార్లమెంటుకు ఉందని వాదిస్తోంది.
ఎన్నికల కమిషనర్ల నియామక వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ చట్టంపై దాఖలైన సవాళ్లను పెద్ద రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. జస్టిస్ శర్మ దీనిని పెద్ద బెంచ్‌కు పంపాలని కోరగా, జస్టిస్ దత్తా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయినప్పటికీ.. దీనిపై కాలయాపన చేయకుండా.. తగిన బలమైన బెంచ్ ఏర్పాటు కోసం సీజేఐ పరిశీలనకు పంపాలని ఇద్దరు న్యాయమూర్తులు అంగీకరించారు.
దీంతో.. ప్రస్తుతానికి 2023 చట్టమే అమల్లో ఉంది. సీజేఐ లేకుండానే నియామకాల తంతు కొనసాగుతోంది. అయితే.. రాజ్యాంగం కల్పించిన స్వతంత్రతకు, పార్లమెంటు చట్టబద్ధమైన అధికారాలకు మధ్య జరుగుతున్న ఈ న్యాయపోరాటం ముగింపు ఎటువైపు దారితీస్తుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
పెరట్లోని మొక్కే కదా అని తేలిగ్గా చూస్తే… అది రేపు వటవృక్షమై నీడను అడ్డుకోవచ్చు. అలాగే, ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికల సంఘం విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును శాసిస్తుంది. సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రి కూర్చోవడం కేవలం వ్యక్తుల మార్పు కాదు… అది అధికార గుత్తాధిపత్యానికి ప్రతీక.! ఈ న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి!
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)

