Alcohol : బీర్‌, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?

Death Rate Due To Alcohol Consumption May Differ

Death Rate Due To Alcohol Consumption May Differ

మద్యం తాగేవాళ్లలో ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు? బీర్ తాగేవాళ్లా? విస్కీ, వోడ్కా లాంటి మద్యం తాగేవాళ్లా? లేదంటే వైన్ తాగేవాళ్లా? అసలు మనం తాగే మద్యం రకాన్ని బట్టి ప్రాణాలకు ముప్పు మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఏకంగా 3 లక్షల 40 వేల మందిపై భారీ అధ్యయనం చేశారు. దాదాపు పదమూడున్నరేళ్ల పాటు వాళ్ల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. చివరికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు.

బ్రిటన్‌కు చెందిన యూకే బయోబ్యాంక్‌లో నమోదైన 3 లక్షల 40 వేల 924 మంది వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. వీళ్లలో ఎవరు ఎంత మద్యం తాగుతున్నారు? ఎలాంటి మద్యం తీసుకుంటున్నారు? ఎంత తరచుగా తాగుతున్నారు? అనే వివరాలను సేకరించారు.

బీర్, వైన్, విస్కీ, వోడ్కా వంటి మద్యం రకాల ఆధారంగా వారి ఆరోగ్య పరిస్థితులను పోల్చి చూశారు. ఈ అధ్యయనం కొనసాగిన కాలంలో మొత్తం 22 వేల 381 మంది మరణించారు. ఎక్కువగా మద్యం తాగేవాళ్లలో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆశ్చర్యకరంగా మితంగా మద్యం తీసుకునేవాళ్లలో కూడా క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదం పెరిగినట్లు తేలింది.

అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఎక్కువగా బీర్ తాగేవాళ్లలో వివిధ కారణాలతో మరణించే ప్రమాదం పెరిగింది.

విస్కీ, వోడ్కా వంటి స్పిరిట్స్ తీసుకునేవాళ్లలో తక్కువ మోతాదులో తాగినా కొన్ని మరణ ప్రమాదాలతో సంబంధం కనిపించింది. మరోవైపు తక్కువ మోతాదులో వైన్ తీసుకునేవాళ్లలో మరణాల రేటు తక్కువగా నమోదైంది. ముఖ్యంగా రెడ్ వైన్ తక్కువగా లేదా మితంగా తీసుకునేవాళ్లలో గుండె సంబంధిత మరణాలు తక్కువగా కనిపించాయి. కానీ వైన్ ఎక్కువగా తాగినప్పుడు, ముఖ్యంగా వైట్ వైన్, ఫోర్టిఫైడ్ వైన్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ సహా మరణాల ప్రమాదం పెరిగింది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పరిశోధకులు పరిశీలించిన 20 రకాల క్యాన్సర్లలో 15 రకాల క్యాన్సర్ మరణాలతో మద్యపానానికి సంబంధం కనిపించింది. వీటిలో కాలేయం, జీర్ణవ్యవస్థ, రొమ్ము, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు కూడా ఉన్నాయి.

అయితే వైన్ తాగేవాళ్లలో మరణాలు తక్కువగా కనిపించాయని వైన్ ఆరోగ్యానికి మంచిదని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఆర్థిక పరిస్థితులు కూడా ఈ ఫలితాలను ప్రభావితం చేసి ఉండొచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. మరో విషయం కూడా గుర్తించారు. భోజనంతో పాటు మద్యం తీసుకునేవాళ్లలో, భోజనానికి దూరంగా మద్యం తాగేవాళ్లతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా కనిపించింది. అయితే భోజనంతో తాగితే ప్రమాదం ఉండదని దీని అర్థం కాదు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ పరిశోధన మద్యం రకాలకు, మరణాల ప్రమాదానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. ఏ మద్యం వల్ల ఎంతమంది చనిపోయారో నేరుగా నిరూపించలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మద్యం తీసుకోవడంలో పూర్తిగా ప్రమాదరహితమైన మోతాదు అంటూ ఏదీ లేదని స్పష్టం చేస్తోంది. కాబట్టి బీర్ కంటే వైన్ మంచిదని, విస్కీ కంటే బీర్ సురక్షితమని నిర్ణయించుకోవడం కన్నా, మద్యం ఎంత తాగుతున్నాం, ఎంత తరచుగా తాగుతున్నాం అనేదే మన ఆరోగ్యానికి అత్యంత కీలకం. అసలు తాగకపోవడం అన్నిటికంటే ఉత్తమం.