“మా ఉనికిని చెరిపేయాలనుకున్న ప్రతి ప్రయత్నం.. మా చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి పునాది అవుతుంది..!” అమెరికా గడ్డపై ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. తరతరాలుగా సమాజం నుంచి అవమానాలు భరించిన LGBTQ+ కమ్యూనిటి గొంతుల తిరుగుబాటుతో ట్రంప్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనపడింది.
ఎరుపు, నీలం రాజకీయాల మధ్య.. ఏడు రంగుల రెయిన్బో సునామీలా ఎగిసిపడింది! 18 మంది LGBTQ+ అభ్యర్థులు ఫెడరల్ పదవులకు పోటీ చేస్తే.. 17 మంది విజయం సాధించారు. అమెరికా కాంగ్రెస్‌లో చరిత్రలోనే అత్యధిక LGBTQ+ ప్రాతినిధ్యం ఇదే.
ఈ విజయాల్లో ప్రతి పేరు వెనుక ఒక పోరాటం ఉంది. ప్రతి సీటు వెనుక ఒక చరిత్ర ఉంది. ముందుగా న్యూ హాంప్‌షైర్ నుంచి క్రిస్ పప్పాస్ గురించి చెప్పుకోవాలి.
అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి బహిరంగ గే పురుషుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఒక గే వ్యక్తి దేశ అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టడం.. దశాబ్దాలుగా సాగిన అణచివేత రాజకీయాలకు బలమైన సమాధానం! ఇండియానా నుంచి జేడీ ఫోర్డ్ విజయం సాధించారు. ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి బహిరంగ గే ప్రతినిధిగా నిలిచారు. ఇక ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ విజయాలు చూస్తే.. ఇది మరింత పెద్ద రాజకీయ పరిణామంగా చెప్పుకోవాలి. అలబామా నుంచి అలిసన్ మాంట్గొమేరీ చట్టసభలో అడుగుపెట్టారు. ఆ రాష్ట్ర తొలి బహిరంగ ట్రాన్స్‌జెండర్ చట్టసభ సభ్యురాలిగా చరిత్ర సృష్టించారు.
వాషింగ్టన్ నుంచి జేలిన్ స్కాట్ విజయం సాధించారు. తొలి బహిరంగ నల్లజాతి ట్రాన్స్ మహిళా చట్టసభ సభ్యురాలిగా గుర్తింపు పొందారు. జార్జియా నుంచి బెంట్లీ హడ్జిన్స్ ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర చట్టసభలో తొలి బహిరంగ ట్రాన్స్, నాన్ బైనరీ ప్రతినిధిగా నిలిచారు.
మిషిగన్ నుంచి జోఅన్నా వేలీ కూడా తన విజయంతో ట్రాన్స్ ప్రాతినిధ్యానికి మరో అధ్యాయం జోడించారు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్‌లో తొలి బహిరంగ ట్రాన్స్‌జెండర్ మహిళగా చరిత్ర సృష్టించిన సారా మెక్‌బ్రైడ్ మరోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఇది ఎంతటి రాజకీయ మార్పు అంటే.. ఒకప్పుడు తమ ఉనికిని నిరూపించుకోవాల్సి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు దేశ చట్టాలను రూపొందించే స్థానాల్లో కూర్చోబోతున్నారు. అయితే ఈ విజయం ఎందుకు ఇంత ముఖ్యమో కూడా చెప్పుకోవాలి.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత లింగ గుర్తింపును ప్రభుత్వ విధానాల్లో పరిమితం చేసే నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్జెండర్ల సైనిక సేవపై ఆంక్షలు విధించారు. జెండర్ అఫర్మింగ్ వైద్య సేవలపై పరిమితులు విధించే ప్రయత్నాలు చేశారు. LGBTQ+ హక్కులపై సాగిన ఈ విధానాలను హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఒక మనిషి ఎవరిని ప్రేమించాలి? తనను తాను ఏ జెండర్‌గా గుర్తించుకోవాలి? తన శరీరం, తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉండాలి? ఈ ప్రశ్నలను రాజకీయ యుద్ధభూమిలోకి లాగారు. ట్రాన్స్జెండర్ల ఉనికినే ఎన్నికల ప్రచారానికి ఆయుధంగా మార్చారు. వారి హక్కులను వివాదంగా చిత్రీకరించారు. అయితే ఇప్పుడు అదే కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎన్నికల బరిలో నిలబడి ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తున్నారు. ఒకప్పుడు తమ కోసం మాట్లాడే నాయకుల కోసం ఎదురుచూసిన ప్రజలు ఇప్పుడు వారంతట వారే ప్రజల సపోర్ట్‌తో నాయకులవుతున్నారు. తమ జీవితాలను ప్రభావితం చేసే చట్టాల రూపకల్పనలో వారే భాగస్వాములవుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ చేతిలో అధికారం మాత్రమే కాదని.. అణగారిన వర్గాలకు కూడా ఆ అధికారంలో భాగస్వామ్యం కల్పించడమేనని నిరూపిస్తున్నారు.
నిజానికి ట్రంప్‌కు ఈ ఎన్నికలు ఒక రాజకీయ హెచ్చరికగా నిలుస్తున్నాయి. అధికారంతో లింగ గుర్తింపులను చెరిపేయాలని చూసే రాజకీయాలకు ప్రజాస్వామ్య పోరాటం ఎదురవుతుందని ఈ విజయాలు గుర్తుచేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెయిన్బో జెండా ఇప్పుడు వీధుల్లోనే రెపరెపలాడటం లేదు.. అమెరికా అధికార కేంద్రాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది!

