Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?

Ai Threat

Ai Threat

AI..మనిషి నియంత్రణ దాటితే ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.. ఆ భయం ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కథలా లేదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలోనే ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలు దీని గురించి హెచ్చరించే స్థాయికి చేరుకుంది.

న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ చేసిన హెచ్చరిక మరింత కలవరపెడుతోంది. ఏఐ అభివృద్ధిని, దాని వినియోగాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మొత్తం మానవాళికే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంటే ఇప్పటివరకు మనిషి తన తెలివితో సృష్టించిన సాంకేతికతే ఒక దశలో మనిషి ఉనికికే ముప్పుగా మారే పరిస్థితిని ఊహించాల్సి వస్తోంది.

ఇక్కడ అసలు భయంకరమైన విషయం ఏంటంటే ఏఐ రోజురోజుకీ మరింత శక్తివంతంగా మారుతోంది. దాని సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ దాన్ని నియంత్రించే బాధ్యత కూడా అంతే పెద్దదిగా మారుతోంది. ఒక్క కంపెనీ, ఒక్క దేశం లేదా ఒక్క నాయకుడు ఈ సమస్యను ఒంటరిగా ఎదుర్కోలేరని అమోడీ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఏఐ విషయంలో ప్రభుత్వాల పాత్ర ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఏఐకి సంబంధించిన అత్యంత కీలక నిర్ణయాలు కొన్ని టెక్ కంపెనీల కార్యాలయాల్లో మాత్రమే తీసుకునే పరిస్థితి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా ఆ నిర్ణయాల్లో భాగం కావాలని ఆయన సూచించారు.

అయితే ఈ భయానికి మరో కోణం కూడా ఉంది. ఏఐని ఉపయోగించేది మనుషులే. అదే టెక్నాలజీ దాడి చేయడానికి కూడా ఉపయోగపడొచ్చు, దాడిని అడ్డుకోవడానికి కూడా ఉపయోగపడొచ్చు. హగ్గింగ్ ఫేస్ సహ వ్యవస్థాపకుడు క్లెమెంట్ డెలాంగ్ చెప్పిన అనుభవం దీనికి ఉదాహరణ. తమ సంస్థపై ఏఐ ఆధారిత దాడి జరిగిందని, చివరికి అదే ఏఐని ఉపయోగించి దాన్ని ఎదుర్కొన్నామని ఆయన వెల్లడించారు. మరింత ఆసక్తికరంగా, తమ రక్షణ కోసం చైనా రూపొందించిన ఒక ఏఐ మోడల్‌ను ఉపయోగించామని చెప్పారు.

అంటే రేపటి సైబర్ ప్రపంచంలో మనిషి వర్సెస్ ఏఐ అనే పోరాటం మాత్రమే ఉండకపోవచ్చు. ఒక ఏఐ మరో ఏఐతో పోరాడే పరిస్థితి కూడా రావచ్చు. ఎవరి చేతిలో ఏఐ ఉంటుంది, అది ఎంత శక్తివంతంగా ఉంటుంది, దాన్ని ఎవరు ఎలా ఉపయోగిస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు దేశాల భద్రతతోనే ముడిపడుతున్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి వేదికపై ఏఐ నియంత్రణ గురించి చర్చ జరుగుతోంది. అమెరికా మాత్రం ప్రపంచం మొత్తానికి ఒకే రకమైన నియంత్రణ వ్యవస్థ తీసుకురావడంపై భిన్నమైన వైఖరి వ్యక్తం చేసింది. చైనా మాత్రం దేశాల మధ్య మరింత సమన్వయం, నియంత్రణ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాలు అవసరమని చెబుతోంది.

ఇన్ని విభిన్న అభిప్రాయాల మధ్య ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ భవిష్యత్తు గురించి మాట్లాడే దశ దాటి, దాని శక్తిని ఎలా నియంత్రించాలనే దశకు ప్రపంచం వచ్చేసింది. మనిషి సృష్టించిన తెలివైన యంత్రం ఎప్పటికీ మనిషి చెప్పినట్టే వింటుందా? లేదా ఒకరోజు మనిషి తన చేతులతో సృష్టించిన శక్తినే నియంత్రించడానికి పరుగులు తీయాల్సి వస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద ప్రశ్న.