మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పుకుంటాం… మానవత్వానికి మించిన గొప్ప లక్షణం మరొకటి ఉండదంటారు… కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ లక్షణాన్ని క్రమంగా కోల్పోతున్నారు. రాజకీయం – వ్యాపారం… ఈ రెండింటిని రెండు కళ్లుగా భావించి శ్వేతసౌధాన్ని ఏలుతున్న పెద్దన్న… ఇతర దేశాల్లో ప్రజల చావుకు కారణమవుతున్నారు. ట్రంప్ నిర్వాకానికి పసి పిల్లలు కూడా శవాలుగా మారుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఎన్నో ఆస్పత్రుల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. కనీస వైద్యం అందక బాలింతలు, చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పాపం ఎవరిదో తెలుసా…? ఆప్ఘన్ ప్రభుత్వానిదో…, అక్కడి వైద్యులదో కాదు… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ మిషన్స్ లో భాగంగా ఆఫ్ఘాన్ లాంటి దేశాలకు ఇచ్చే నిధులను ట్రంప్ నిలిపివేశారు. ఇంతకాలం అలాంటి నిధులపై ఆధారపడి బతుకుతున్న పేద దేశాల ప్రజలు ట్రంప్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి బాలింతల వరకు అందరూ ట్రంప్ బాధితులే.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మరణాలు నిత్యకృత్యంగా మారాయి. 18 నెలల్లో అమెరికా నిధుల కోత వల్ల కనీసం 161 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన ఓ చిన్నారికి ఆక్సిజన్ అవసరం. కానీ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం లేదు. కారణం… అమెరికా విదేశీ నిధులను నిలిపివేయడమే. రెఫ్యూజీస్ ఇంటర్నేషనల్ సంస్థ… క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈ దారుణాలను వెలుగులోకి తెచ్చింది.
ఈ మరణాలు వంద శాతం నివారించదగినవే. ఆసుపత్రులకు నిధులు రాకపోతే మహిళలు, పిల్లలు చనిపోతారనే కనీస అవగాహన.. అమెరికా లాంటి పెద్ద దేశానికి లేకుండా పోయింది. 2025లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే విదేశీ సహాయక కార్యక్రమాలను నిలిపివేశారు. బిలియన్ల కొద్దీ డాలర్ల సహాయాన్ని స్తంభింపజేశారు. ఏళ్ల తరబడి అంతర్జాతీయ సహాయంపై ఆధారపడిన ఆఫ్ఘనిస్తాన్… దీని కారణంగా తీవ్రంగా నష్టపోయింది. అకస్మాత్తుగా 1.7 బిలియన్ డాలర్ల సహాయం నిలిచిపోవడంతో ప్రసూతి, చిన్నపిల్లల వార్డులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాణాధారమైన వందలాది ఆరోగ్య కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో గర్భిణులు వైద్యం కోసం గంటల తరబడి ప్రయాణించి ప్రాంతీయ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి ప్రయాణాల్లో కొందరు తల్లీబిడ్డలు ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రసూతి సంరక్షణలో నాణ్యత భారీగా పడిపోయింది. గతంలో సురక్షితమైన డెలివరీ సేవలు అందించిన ఫ్యామిలీ హెల్త్ హౌస్‌లు ఇప్పుడు పనిచేయడం లేదు. ఆసుపత్రులకు వెళ్లేందుకు వాహనాలు కూడా దొరక్క ఎంతోమంది ఇంట్లోనే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవిస్తున్నారు.
ఆసుపత్రుల్లోని వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు మరమ్మతులకు నిధులు లేక మూలనపడ్డాయి. అమెరికా నిధుల కోతతో ఒక్క నంగర్హార్ ప్రాంతంలోనే 180 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. అర్బన్ హెల్త్ ఇనిషియేటివ్ సంస్థ నుంచి 1500 మంది ఉద్యోగాలను కోల్పోయారు. కుటుంబానికి ఆధారం పోవడంతో కొందరు ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన ఆరోగ్య, పోషకాహార లోపం… అతి పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారింది. దేశంలో 10 మంది పిల్లలలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అమెరికా లాంటి దేశాలు పెద్ద మనసు చేసుకుని అందించిన నిధులు ఒక్కసారిగా ఆగిపోయే సరికి… ఆప్ఘాన్ లో ఆరోగ్యరంగం ఎన్నో ఇబ్బందులు పడుతోంది….
అమెరికా ఆర్థికపరమైన నిర్ణయాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న తీరు నిజంగా హృదయవిదారకం. యుద్ధాల కోసం… మిలటరీ కోసం.. వేల కోట్ల డాలర్లు తగలేసే అమెరికా లాంటి దేశాలు… కనీస మానవత్వం ప్రదర్శించకుండా ఇలా నిధులు నిలిపివేయడం అమానవీయం.

