FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్‌ అంటే ఏంటి?

Food Prices

Food Prices

కిరాణా సరుకుల బిల్లులు రోజురోజుకూ ఎందుకు పెరుగుతున్నాయో ఎప్పుడైనా గమనించారా ? ఆహార కొరత ఎక్కడా కనిపించకపోయినా.. బియ్యం, గోధుమలు, చక్కెర ధరలు ఆకాశాన్ని ఎందుకు తాకుతున్నాయో ఆలోచించారా…? ప్రపంచ వ్యాప్తంగా పంటల ఉత్పత్తి బాగానే ఉన్నా.. ధరలు మాత్రం మండిపోతున్నాయి. అసలు రైతు పండించే పంటకు.. మనం చెల్లించే బిల్లుకు మధ్య ఏం జరుగుతోంది? ఆహార సంక్షోభం ముప్పు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది ?

ఏ దేశంలోనైనా ధరలు పెరగడం… తగ్గడం అన్నది కామన్ ఫినామినానే. కానీ ఈ మధ్య వ్యవసాయ సంక్షోభం లేకపోయినా సరే… ఇంటి సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణం 4ఎఫ్ క్రైసిస్. 4ఎఫ్ అంటే… ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫైనాన్స్. ఈ నాలుగే ధరలను ఆమాంతం పెంచేస్తున్నాయి. ఆహారాన్ని పండించే… రవాణా చేసే.. ఫైనాన్స్ చేసే వ్యవస్థలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడమే అసలు సమస్య. ఎరువుల కొరత…రవాణా వ్యవస్థల్లో ఆటంకాలు ఈ పరిస్థితికి కారణం. దీని ప్రభావం ప్రపంచ ఆహార ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆహార ధరల సూచీ సెప్టెంబర్ 2026 నాటికి 136 పాయింట్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. తృణధాన్యాల ధరలు 17.2 శాతం.. చక్కెర ధరలు 14.7 శాతం పెరిగాయి. అయితే 2026లో ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తి 2.9 బిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఉత్పత్తి బాగానే ఉన్నప్పుడు ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్నది పెద్ద ప్రశ్న.

రవాణా వ్యవస్థల్లో ఆటంకాలు ఆహార మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గోధుమలు.. మొక్కజొన్న ఎగుమతుల్లో ఉక్రెయిన్ ది కీలక పాత్ర. అయితే నల్ల సముద్రం ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గోధుమ ధరలు సెప్టెంబర్‌లో 6.3 శాతం మేర పెరిగాయి. మరోవైపు ఆహార ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా.. ఎరువుల తయారీ మాత్రం రష్యా, చైనా, మొరాకో, గల్ఫ్ దేశాలకే పరిమితమైంది. ఈ ఏడాది హార్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడినప్పుడు.. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడో వంతు ప్రమాదంలో పడింది. యూరియా, అమ్మోనియా లాంటి నత్రజని ఎరువుల తయారీకి సహజ వాయువు అత్యవసరం. గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ఖర్చు అమాంతం పెరుగుతుంది. రైతులు సరైన సమయానికి ఎరువులు వాడకపోతే…నెలల తర్వాత పంట దిగుబడి తగ్గిపోయి ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఏడాది ఎరువుల సరఫరా అంతరాయం.. 2027 నాటి వ్యవసాయ ఉత్పత్తులను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ఎరువుల సరఫరాపై ఆందోళన మొదలైనప్పుడు చాలా దేశాలు తమ రైతుల కోసం వాటిని నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి. చైనా, రష్యా లాంటి దేశాలు ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచ మార్కెట్లకు చేరాల్సిన ఎరువులు ఆగిపోయాయి. పర్షియన్ గల్ఫ్ అంతరాయాల తర్వాత ప్రపంచ ఎరువుల ఎగుమతుల్లో 15 నుంచి 23 శాతం ఆంక్షల పరిధిలోకి వెళ్లాయని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా వేసింది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఎరువులు దొరక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం, ఇంధనం, ఎరువుల అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో డాలర్ బలపడి.. ఇతర దేశాల కరెన్సీల విలువ పడిపోతుంది. డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాంటి స్థానిక కరెన్సీల మారకపు విలువ పతనమవడంతో.. ఆ నష్టభారం కోట్ల రూపాయల్లో ఆయా దేశాలపై పడుతోంది. పేద దేశాలు సబ్సిడీలు భరించలేక పెరుగుతున్న ఆహార ధరల భారాన్ని గత్యంతరం లేకుండా మోయాల్సి వస్తోంది.

ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. రానున్న చలికాలంలో అత్యంత బలమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం 90 శాతానికి పైగా ఉందని అంచనా. ఆఫ్రికా, దక్షిణాసియా, సెంట్రల్ అమెరికా ప్రాంతాలు ఎల్ నినో కారణంగా కరవు బారిన పడే ముప్పు ఉంది. ఇక మన దేశం విషయానికొస్తే… ఆహార ధాన్యాల విషయంలో మనం పటిష్టమైన స్థితిలోనే ఉన్నాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 376 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. కాబట్టి భారత్ లో బియ్యం…గోధుమల కొరత తక్షణమే వచ్చే అవకాశం లేదు. అయితే మనం ఎరువులు, ఇంధనం కోసం ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నాం. గల్ఫ్ ప్రాంతం నుంచి ఎరువుల ఎగుమతులు తగ్గినప్పుడు.. భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది.

పర్షియన్ గల్ఫ్ లో సరఫరా దెబ్బతినడంతో మన దేశం అప్రమత్తమైంది. చైనా, ఈజిప్ట్, వియత్నాం, రష్యా నుంచి నత్రజని ఎరువులను సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే మన ఎరువుల దిగుమతులు 52 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులు అదనంగా కొనుగోలు చేశాం. ప్రస్తుతం మన దగ్గర తగినంత ఆహార నిల్వలు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు పంటలకు అవసరమైన ఎరువుల ఖర్చు పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంది. దీన్ని బట్టి చూస్తే అసలు సమస్య ఆహార కొరత కాదు.. సామాన్యుడికి ఆ ఆహారం అందుబాటు ధరలో దొరుకుతుందా అన్నదే ప్రధానం. ప్రపంచంలో ఏ మూల సంక్షోభం వచ్చినా.. అది మన దేశంపై పడకుండా చూసుకోవడమే నిజమైన ఆహార భద్రత.