ఎక్కడో భరించలేని ఎండ.. మరెక్కడో కుండపోత.. ఇంకొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరవు. ఇప్పుడు ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేసే ఒక ప్రకృతి పరిణామం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అదే ఎల్‌నినో.
2026లో మొదలైన ఈ ఎల్‌నినో ప్రభావం గతంలో ప్రపంచాన్ని వణికించిన 1997 నాటి రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందని NASA శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించబోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఎల్‌నినో మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. ఈ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. సముద్రంలో మొదలయ్యే ఈ ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశను, వర్షపాతాన్ని, వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది.
దీనికారణంగా కొన్ని ప్రాంతాల్లో కరవు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల తీవ్రమైన వేడిగాలులు ఏర్పడవచ్చు. గతంలో 1997-98, 2015-16 సంవత్సరాల్లో నమోదైన ఎల్‌నినో పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇండోనేషియా, అమెజాన్ ప్రాంతాల్లో కార్చిచ్చులు, దక్షిణ ఆఫ్రికాలో కరవు, అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు 2026-27లో ఏర్పడుతున్న ఎల్‌నినో కూడా అదే స్థాయిని దాటవచ్చని NASA పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికోసం గత 35 ఏళ్లుగా ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు అది విస్తరిస్తుంది. దీంతో సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. ఉపగ్రహాల ద్వారా సముద్ర ఉపరితల ఎత్తులో వస్తున్న మార్పులను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు సముద్రంలో ఎంత వేడి పేరుకుపోతోందో గుర్తిస్తున్నారు.
NASA అక్టోబర్ పరిశీలనల్లో 1997 నాటి ఎల్‌నినోతో పోలిన పరిస్థితులు కనిపించాయి. పశ్చిమ పసిఫిక్‌లో సముద్ర మట్టాలు తగ్గడం, తూర్పు ప్రాంతంలో పెరగడం, దక్షిణ అమెరికా వైపు అసాధారణంగా వేడినీరు విస్తరించడం లాంటి మార్పులు నమోదయ్యాయి. NOAA నవంబర్ 12న విడుదల చేసిన అంచనాలో ఈ ఎల్‌నినోను అత్యంత బలమైన కేటగిరీగా వర్గీకరించింది. 1950 తర్వాత ఇంతటి తీవ్రత నమోదైన సందర్భాలు మూడే ఉన్నాయి.
1982-83, 1997-98, 2015-16. 2027 ప్రారంభంలో కూడా ఈ పరిస్థితులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రభావాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వాతావరణానికే పరిమితం కావడం లేదు. మన ఆరోగ్యంపైనా తీవ్ర పరిణామాలు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నాయి. మొదటిది తీవ్రమైన వేడిగాలులు. ఉష్ణోగ్రతలు పెరిగితే వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. రెండోది గాలి కాలుష్యం. అడవుల్లో కార్చిచ్చులు పెరిగితే పొగ, సూక్ష్మ ధూళి కణాలు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి ఇబ్బందులను తీవ్రతరం చేయవచ్చు. మూడోది అంటువ్యాధుల ముప్పు. వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల దోమలు వ్యాప్తి చెందే పరిస్థితులు మారవచ్చు. దీంతో డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల ముప్పు కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంటుంది.
వరదల కారణంగా కలుషితమైన నీరు అందుబాటులోకి వస్తే కలరా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇక మరో తీవ్రమైన సమస్య ఆహార భద్రత. వర్షాలపై ఆధారపడే వ్యవసాయ ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటే ఆహార కొరత ఏర్పడవచ్చు.
ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారం 2027 చివరి నాటికి ఎల్‌నినో ప్రభావంతో మరో 4 కోట్ల 90లక్షల మంది తీవ్ర ఆహార అభద్రతలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే ఎల్‌నినో ప్రభావం ప్రతి దేశంలో ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో కరవు ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చు. కాబట్టి రానున్యన వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనించడం, ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం.
సముద్రంలో మొదలయ్యే ఒక ఉష్ణోగ్రత మార్పు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల ఆహారం, ఆరోగ్యం, జీవన విధానాన్ని ప్రభావితం చేయగలదు. ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే.. 2026-27 ఎల్ నినో గత రికార్డులను అధిగమిస్తుందా? దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం ఎంతవరకు సిద్ధంగా ఉంది?

