Special Story on Vinayaka: చదువుకోవాలనే మనసు, అమితాసక్తి ఉండాలే గానీ ప్రతి వ్యక్తి జీవితమూ ఒక విలువైన పుస్తకమే. పుస్తకాన్ని పఠించి మస్తకాన్ని మథిస్తే విజ్ఞానం పుడుతుంది. విఘ్నేశ్వరుడి పుట్టుక, లీలల విశేషాలు దీనికో చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ గణపతి.. సకల కళలకు, శాస్త్రాలకు అధిపతి. ఈ దేవదేవుడు.. బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడు. అందుకే ఈ పార్వతీ పుత్రుడికి ప్రతి క్రతువులో ప్రథమ పూజ చేస్తారు. ఇవాళ ఈ ఏకదంతుడి జన్మదినం. ఉత్సవాలకు ఆరంభం. ఈ ప్రత్యేక, పర్వదిన సందర్భంలో ఆయనకే సొంతమైన, అరుదైన రూపం, తనదైన వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యాంశాలపై విశ్లేషణే ఈ ప్రత్యేక కథనం.
ద్వారపాలకుడిగా ప్రాణం పోసుకున్న గణనాథుడు తల్లి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తాడు. బిడ్డలకు అమ్మే తొలి గురువు అనే ప్రకృతి సత్యాన్ని, సహజ సూత్రాన్ని స్వతహాగా అర్థంచేసుకొని మసలుకుంటాడు. చివరికి తండ్రి పరమేశ్వరుడిని సైతం లోపలికి ప్రవేశించనివ్వడు. తద్వారా తనకు తెలియకుండానే తనలోని అమాయకత్వాన్ని చాటుకుంటాడు. దీనికి శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి తలను ఛేదిస్తాడు. తదనంతర పరిణామాల్లో ఆ ఓంకారుడు గజాననుడిగా మారిపోతాడు. అజ్ఞానం ఎంత చేటు చేస్తుందో ఈ అనూహ్య ఘటన వివరిస్తుంది. దీన్నుంచి ప్రతిఒక్కరూ జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్చుకోవచ్చు.
ఈ అవనీషుడు, భారీ కాయుడు మూషికం అనే అతి చిన్న వాహనంపైనే ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. తిరుగులేని నాయకత్వ లక్షణాలతో లోకాన్ని ఏలాడు. ఈ నిరంతర ప్రయాణంతో ఆ అద్వైతుడు మానవులకు గొప్ప సందేశమిచ్చాడు. నేల విడిచి సాము చేయకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమనుతాము మలచుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలని పరోక్షంగా బోధించాడు. పోటీ ప్రపంచంలో గెలవటానికి అరివీర భయంకరంగా కష్టపడాల్సిన పనిలేదని, విజ్ఞతతో వ్యవహరిస్తే చాలని చెప్పాడు. తల్లిదండ్రులే తన ప్రపంచమని చాటడం ద్వారా లాజిక్‌తో ఆలోచించాలనే సూచన చేశాడు.
‘జై బోలో గణేష్ మహరాజ్‌కీ..’ అని భక్తులు ఊరికే సరదాగా అనట్లేదు. అందులో ఎంతో లోతైన అర్థం ఉంది. గణ్ అంటే గ్రూపు అని అర్థం. మనిషి సంఘజీవి కాబట్టి నలుగురితో కలిసి నడవటం వల్ల లోకజ్ఞానం పొందొచ్చని నేర్పాడు. ఆడవాళ్లు తిరిగి చెడతారనేది పాత కాలం నాటి మాట కావొచ్చు గానీ మగవాళ్లు మాత్రం తిరగక చెడతారనేది అందరూ ఒప్పుకునేదే. అందువల్ల విద్యార్థి దశ నుంచే బృందంతో కలిసి పనిచేసే మంచి లక్షణాన్ని అలవరచుకోవాలని ఏకదంతుడు ఏకవాక్య తీర్మానంలా తేల్చేశాడు. ఈ క్రమంలో నడత, నడక రాజసంగా, ఆదర్శంగా ఉండాలని, వక్రమార్గంలో సాగకూడదని ఈ వక్రతుండుడు నొక్కి వక్కాణించాడు.
వినాయకుడి శరీరం, ఆకారం విభిన్నంగా, వికటంగా ఉంటుంది. అయినా తొండంతోనే అన్ని పనులు చేసుకుంటాడు. ఆహార పదార్థాల వాసన చూడటం, వాటిని తినటం, నీళ్లు తాగటం, ఒంటి మీద నీళ్లు పోసుకోవటం, తద్వారా శరీరాన్ని శుభ్రపరచుకోవటం.. ఇలా అన్నీ ఒకే ఒక అంగంతో చేసుకుంటాడు. ఇలాంటి సంక్లిష్ట జీవితంలో అష్టకష్టాలనూ అవలీలగా ఈదాడు. సర్వాంగాలూ సక్రమంగా ఉన్న ఎందరో చేయలేని ఎన్నో స్వకార్యాలను, సకార్యాలను దిగ్విజయంగా పూర్తిచేసి చూపాడు. జ్ఞాన శక్తికి, కర్మ శక్తికి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌ని ఆచరణలో పెట్టిచూపాడు.
తల్లి చేతుల్లో రూపం సంతరించుకొని, తండ్రి చేతుల్లో, తండ్రి రూపంలో విధి వక్రీకరించినా తల్లడిల్లకుండా, వెరవకుండా నిత్య జీవిత ఆటంకాలను నిర్భయంగా పటాపంచలు చేశాడు. గజేంద్రుడంటే అధికారానికి, బలానికి, ధైర్య సాహసాలకు చిహ్నంగా నిలిచాడు. ప్రతికూల పరిస్థితులను, మంచీ చెడులను అన్నింటినీ మనలోనే నింపుకొని, దిగమింగుకొని, పరోపకారిగా జీవించాలంటూ ఈ లంబోదరుడు సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించాడు. ఓ చెయ్యితో అభయమిచ్చాడు. మరో చేతితో ఆధ్యాత్మిక తోవ చూపాడు. ఏక దంతంతో ఏక దృష్టికి సంకేతంగా మారాడు. లక్ష్య సాధనపైనే ఫోకస్ పెట్టాలని ఉద్భోదించాడు.
గణేశుడిలోని ఈశ అంటే యజమాని అని అర్థం. దురాలోచనలు, అత్యాశలపై నియంత్రణ, ఆధిపత్యం ద్వారా ప్రోది చేసుకున్న ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా విజయాలు సాధించొచ్చనే భావనను వినాయకచతుర్థి పండుగ మది నిండుగా నింపుతోంది. మన చుట్టూ ఉండే అతిపెద్ద ప్రతిబంధకాలను చాకచక్యంగా ఎలా విచ్ఛిన్నం చేయొచ్చో విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను చూసి కూడా నేర్చుకోవచ్చు. పదాలు కాలక్రమేణా మారతాయి కాబట్టి రుషులు వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా చిహ్నాల రూపంలో ఇలాంటి మెసేజ్‌లను భావితరాలకు అందించారు. వాటిని కృషితో పాటిస్తే మనుషులు కూడా రుషులవుతారని తెలిపారు. ఇదే ఈ వినాయకచవితి శుభదినం నిత్య విద్యార్థులకు పంచుతున్న విజ్ఞానం. స్ఫూర్తిదాయకం. అనుసరణీయం.