Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్‌మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గల తెలుగు పాఠ్యాంశాలను తనదైన శైలిలో వీడియో లెసన్స్‌గా మార్చారు. భవిష్యత్తులో 10వ తరగతి వరకు ఉన్న పాఠాలను కూడా ఇలా దృశ్య మాధ్యమంలోకి మార్చనున్నారు.
వర్ణమాల, వ్యాకరణం సహా మన భాషలోని అనేక అంశాల్ని ఉదాహరణలతో వివరించటం ఈ వీడియోల ప్రత్యేకత. ఈ ప్రజెంటేషన్లను జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్స్‌కి పంపిణీ చేస్తూ ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరూ ఈ లెసన్స్ నేర్చుకునేలా ఇంటర్నెట్(ఆన్‌లైన్)లో అందుబాటులోకి తెచ్చారు. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన వందలాది ప్రోగ్రామ్‌ల వీడియోలను యూట్యూబ్(https://www.youtube.com/c/KrishnaPrasadlessons/videos)లో అప్‌లోడ్ చేశారు. దీంతో వివిధ దేశాల్లోని తెలుగువారు ఆయనకు నిత్య విద్యార్థులుగా మారారు. కృష్ణప్రసాద్ క్లాస్‌లను క్రమంతప్పకుండా వింటున్నారు. తద్వారా ఆయనకు 130 దేశాల్లో 35 వేల మంది స్టూడెంట్స్ అయ్యారు. ఇది ఎనిమిదేళ్ల కిందటి వార్త. ఈ మధ్య కాలంలో కృష్ణప్రసాద్ మరెన్ని అప్‌డేట్స్ తీసుకొచ్చారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.