Site icon NTV Telugu

ఆగిఉన్న కారులో యువకుల పాడుపని.. ఇదేంటని అడిగిన బాలుడిని ఏం చేశారంటే..?

దీపావళీ పండగ.. స్కూల్ లేకపోవడంతో ఆ బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటిదగ్గర అమ్మ తనకోసం స్వీట్స్ చేసి పెట్టిన విషయం గుర్తుతెచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న బాలుడికి ఇంటి బయట తమ కారు ఊగడం కనిపించింది. దీంతో బాలుడు కారు వద్దకు వెళ్లి చూడగా అతడికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ పదోతరగతి చదువుతున్నాడు. గురువారం దీపావళీ సెలవు కావడంతో స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వెళ్తున్న అతనికి తమ కారులో ఎవరో ఉన్నారని అనుమానామొచ్చింది. దీంతో కారు దగ్గరికి వెళ్లి డోర్ తీసి చూడగా ముగ్గురు యువకులు కారులో మద్యం సేవిస్తూ కనిపించారు. తమ కారులో ఇలాంటి పాడుపని చేయడంతో కోపం వచ్చిన హిమాన్షు.. ఎవరు మీరు..? మా కారులో మందు తాగుతున్నారేంటి అని నిలదీశాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు బాలుడు గట్టిగా అరవడంతో కోపోద్రిక్తులై అతడిని కారులోకి లాగి మందు తగ్గించడానికి ప్రయత్నించారు. బాలుడు నిరాకరించడంతో మద్యం మత్తులో కత్తితో అతడిని పొడిచి చంపారు.

బాలుడి అరుపులు విన్న స్థానికులు కారు వద్దకు చేరుకొనేలోపు నిందితులు పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని స్థానికులు హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పండగ పూట కొడుకు మృత్యువాత పడడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version