West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారాలు నిత్యకృత్యంగా మారినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే మృగాళ్లు విచ్చలవిడిగా చెలరేగుతున్నారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక శుక్రవారం ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా మోస్తకిన్ సర్దార్ అనే యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేసి, కాలువలో మృతదేహాన్ని పారేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర నిరసన, హింసాత్మక దాడులకు కారణమైంది.
Read Also: Pager Blasts: “పేజర్”లతో హిజ్బుల్లా ఎలా దెబ్బతీసింది..? ఇజ్రాయిల్ “మోసాద్” డెడ్లీ ఆపరేషన్ ఇదే..
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలిని పటాష్‌పూర్‌లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు.
విషం తాగించిన తర్వాత నిందితుడు మహిళని తన ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు. స్థానికులు గమనించి ఆమెను హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఆదివారం తెల్లవారుజామున ఈ వార్త వ్యాపించడంతో కోపోద్రిక్తులైన మహిళలు, స్థానిక ప్రజలు నిందితుడిపై కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.