Woman Kills Husband: దేశవ్యాప్తంగా మగాళ్లకు భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా..? అనే అనుమానం వచ్చేలా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనికి తాజాగా ఉదాహరణ, ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య. భార్య సోమన్ తన లవర్ రాజ్ కుష్వాహాతో ప్లాన్ చేసి హత్య చేసింది.
తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరోకటి జరిగింది. ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. చంపిన తర్వాత మతదేహాన్ని 30 కి.మీ దూరంలో పారేసింది. జూన్ 24న ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలుకాలోని కడశెట్టిహళ్లీ గ్రామంలో జరిగింది.
మృతుడిని 50 ఏళ్ల శంకరమూర్తిగా గుర్తించారు. ఇతను ఫామ్‌హౌజ్‌లో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. తిప్తూర్‌లోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేసే భార్య సుమంగళకు, కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తమకు అడ్డుగా ఉన్న భర్త శంకరమూర్తిని చంపడానికి ఇద్దరు కుట్ర పన్నారు.
నేరం జరిగిన రోజు రాత్రి, సుమంగళ తన భర్త శంకరమూర్తి కళ్లలో కారం పొడి చల్లి, కర్రలతో కొట్టి, అతడి మెడపై కాలుతో నక్కి దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు గోనె సంచిలో మృతదేహాన్ని దాచి దాదాపుగా 30 కి.మీ దూరంలోని తురువేకెరే తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలోని బావిలో పారేశారు.
నోనవినకెరే పోలీస్ స్టేషన్‌లో శంకరమూర్తి మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే, పోలీస్ దర్యాప్తులో మృతుడి మంచంపై కారం పొడి ఆనవాళ్లు ఉండటం అనుమానం కలిగించింది. సుమంగళ విచారించడంతో, ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. చివరకు ఆమె నేరాన్ని అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ సాగుతోంది.
