ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని తనను హింసిస్తున్నాడని ఒక కొడుకు తల్లితో కలిసి తండ్రిని హతమార్చాడు. ఈ విషయం బయటికి తెలియకుండా తండ్రి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. బాగ్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తికి సునీత తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదర్శ్ అనే కొడుకు ఉన్నాడు. గత పది రోజుల నుంచి కమలేష్ కనిపించడం లేదు. దీంతో కమలేష్ తమ్ముడు రాంకిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇటీవల రాంకిషన్ తన వదిన సునీతపై అనుమానం ఉందని, తన అన్న కనిపించకుండా పోవడం వెనుక ఆమె హస్తం ఉందని తెలిపాడు. దీంతో పోలీసులు సునీత ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అయితే ఇది జరిగిన రెండు రోజుల తరువాత స్థానికులు ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని తాళాలు పగలకొట్టి చూడగా కమలేష్ శవంగా కనిపించాడు.
ఇక ఈ కేసును హత్యకేసు కింద నమోదు చేసుకొని సునీత, ఆదర్శ్ ని వెతికి పట్టుకున్నారు. భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో తన కొడుకు వివరించాడు. నిత్యం తండ్రి తాగొచ్చి, తనను, తన తల్లిని హింసించేవాడని.. ఆ బాధలను తట్టుకోలేకే తల్లి సాయంతో తండ్రిని హతమార్చినట్లు చెప్పుకోచ్చాడు. హత్య చేశాక శవాన్ని ఏం చేయాలో తోచక ఇంట్లోనే పెట్టి.. తాము పారిపోయామని ఆదర్ష్ తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
