WhatsApp Emoji Dispute Turns Deadly in Suryapet: వాట్సాప్ ఎమోజీ ఓ వ్యక్తి నిండు ప్రాణం బలితీసుకుంది. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. పద్మశాలి కుల సంఘం సూర్యాపేట టౌన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యమే ఈ ఘటనకు కారణమైంది. ఆ ఎన్నికలకు సంబంధించి కొద్దిరోజులుగా వాట్సాప్ వేదికగా సంఘ సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఆగస్టు మూడో తేదీన సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు జరపటానికి ఆ సంఘం పెద్దలు ప్రకటన ఇచ్చారు. జులై 20న నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ పోటీ చేస్తున్నారు. గత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్‌కు, శ్రీరాముల రాములకు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్‌లో శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకొని రాములు మెసేజ్ పెడుతున్నాడు. రాములు పెట్టిన ఓ మెసేజ్ కు శ్రీనివాస్ ఈ నెల 21న పూర్తిస్థాయిలో బదులిచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ పోస్టుకు మద్దతుగా పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన కుల సంఘ సభ్యుడు, హోల్ సేల్ చెప్పుల వ్యాపారి కృపాకర్ చప్పట్లతో కూడిన ఎమోజీ పోస్ట్ చేశాడు. ఇది కాస్తా శ్రీరాముల రాములు, కృపాకర్ మధ్య వివాదానికి దారి తీసింది. కృపాకర్ మెసేజ్ చూసిన రాములు అతనికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన కృపాకర్ ఈ విషయాన్ని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఈ వ్యవహారాన్ని ఎన్నికల నిర్వాహకులకు, కులపెద్దలకు తెలపాలని సూచించినట్లు తెలుస్తోంది..
READ MORE: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
మరుసటి రోజు కుల పెద్దలకు, ఎన్నికలు నిర్వహించే వారికి ఫిర్యాదు చేసేందుకు సూర్యాపేటలోని పద్మశాలి సంఘం భవనానికి వెళ్ళాడు కృపాకర్. జరిగిన విషయం కులపెద్దలకు, ఎన్నికల నిర్వాహకులకు వివరిస్తుండగానే అక్కడే ఉన్న రాములు ఆయన కుమారుడు ధనంజయ్, మరికొందరు కృపాకర్‌ను దూషిస్తూ దాడి చేశారు. అనంతరం వారు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన కృపాకర్ ను స్థానికులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా… అతన్ని పరీక్షించిన డాక్టర్లు కృపాకర్ అప్పటికే చనిపోనట్లు నిర్దారించారు. ఈ దాడిలో కృపాకర్ అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కృపాకర్ భార్య ఫిర్యాదు మేరకు రాములు ఆయన కుమారుడు ధనంజయ్‌తో పాటు రాములు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుల రాజకీయాలు ఓ అమాయకుడిని బలి చేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కుల రాజకీయాల్లో ఆధిపత్యం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కృపాకర్‌ను చంపిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.. వాట్సాప్ గ్రూప్‌లో చిన్నగా మొదలైన ఘర్షణ.. ఏకంగా వ్యక్తి హత్యకు దారి తీయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వార్‌ను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడమే దీనికి కారణమని విమర్శిస్తున్నారు.