Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో వాటర్ ఫ్యూరిఫైయర్ సర్వీస్ చేయడానికి వచ్చిన వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నగరంలోని బేగూర్‌కి చెందిన మహిళా టెక్కీ తన ఇంట్లో వాటర్ ఫ్యూరిఫైయర్ ఇన్‌స్టాల్ చేయడానికి మే 4న సర్వీస్ రిక్వెస్ట్ పెట్టారు. అయితే, ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని గుర్తించిన టెక్నీషియన్ పరిస్థితిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాడు.
ఫ్యూరిఫైయర్ ఇన్‌స్టాల్ చేసేందుకు మహిళ అతడిని లోపలికి అనుమతించింది. ఆ తర్వాత ఆమె వంట చేసేందుకు వంటగదిలోకి వెళ్లింది. అయితే, ఆమె వెనకాలే వెళ్లిన నిందితుడు ఆమెని గట్టిగా కౌగిలించుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా షాక్‌కి గురైన బాధిత మహిళ అరుస్తూ, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె అతడిని వంటగది నుంచి బటయకు నెట్టి గడియపెట్టుకుంది. సహాయం కోసం వెంటనే సమీపంలోని తన స్నేహితులకు ఫోన్ చేసింది. అయితే, మహిళ వంటగది నుంచి బయటకు వచ్చేవరకు నిందితుడు గది బయటే ఉన్నాడు.
వెంటనే ఆమె స్నేహితురాలి భర్త సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అతడికి, నిందితుడైన టెక్నీషియన్‌కి మధ్య గొడవ జరిగింది. మహిళ స్నేహితుడు టెక్నీషియన్‌ని తలపై కర్రతో దాడి చేయడంతో అతనికి నిందితుడికి రక్తస్రావం జరిగింది. ఈ ఘటన తర్వాత నిందితుడైన వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. దీనిపై మహిళ బేగూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని బుధవారం పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతడిపై ఐపిసి సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
