Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!

Vizag Bhimili Murder Case

Vizag Bhimili Murder Case

Vizag Bhimili Murder: భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. అనుకుంటున్నారు కొంత మంది భార్యలు. ప్రియుడి మోజులో పడి.. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చివరికి కటకటాలపాలై.. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. కనీసం ఆయా కేసులు చూసి కూడా తీరు మార్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి నేరాలే చేస్తూ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలిలోనూ ఓ భార్య భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. మర్డర్ కేసులో దొరికిపోతుందని డ్రామా ఆడినా.. పెద్దగా రక్తి కట్టలేదు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది. ఇంతకీ ఆ కంత్రీ ఇల్లాలు ఎవరు? అసలేం జరిగింది?

భీమిలీ పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యని నిలదీసిన భర్తను హతమార్చింది భార్య. భర్త ఆరోగ్యం బాగోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని డ్రామాలాడింది. కొన ఊపిరితో ఉన్న భర్తను వైద్యం కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లి బంధువులను, వైద్యులను నమ్మించింది. చివరకు భర్త మెడ మీద ఉన్న గాయాలు అసలు గుట్టు రట్టు చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణికి వలందపేటకు చెందిన బోర సూరి తాతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. వలంద పేటలోనే భార్య భర్తలిద్దరూ నివాసం ఉంటున్నారు. భర్త సూరితాత తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భార్య నాగమణి స్థానికంగా ఓ నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో తరచూ నిలదీసేవాడు భర్త. ఇదే విషయమై దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి ఊపిరి తీసేసింది.

అనంతరం ఏమీ తెలియనట్లు.. భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో నాగమణి డ్రామాకు బ్రేక్ పడింది. తానే చున్నీతో బిగించి సూరితాతను హతమార్చానని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఈ హత్యలో నాగమణి ఒక్కదాని పాత్ర ఉందా? లేదా ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భర్తను అత్యంత దారుణంగా చంపేసి డ్రామాలాడిన నాగమణిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.