Site icon NTV Telugu

Vikarabad: సెలవు ప్రకటించుకున్న డాక్టర్లు.. రోగుల అవస్థలు

Doctors Announce Holiday

Doctors Announce Holiday

డాక్టర్లను మనం దేవుళ్లతో పోలుస్తాం. ఎందుకంటే.. ప్రాణపాయ స్థితి నుంచి కాపాడుతారు కాబట్టి! ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలొచ్చినా, దాన్ని నయం చేస్తారనే నమ్మకంతో రోగులు వారి వద్దకే వెళ్తారు. అందుకే.. రోగి కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు గానీ, డాక్టర్ కోసం రోగి వెయిట్ చేయకూడదంటారు. బహుశా కాసేపు వేచి చూసినా, డాక్టర్ వస్తాడన్న నమ్మకమూ రోగుల్ని బ్రతికిస్తుంది. కానీ, ఆ నమ్మకమే ఒమ్మై డాక్టర్లు అందుబాటులోకి రాకపోతే? ఆ రోగి పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇలాంటి పరిణామమే వికారాబాద్‌లో చోటు చేసుకుంది.

పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన రోగులు, కొన్ని క్షణాల్లోనే బయటకు వచ్చేస్తున్నారు. మొదట్లో ఆ దృశ్యం చూసి.. అబ్బో, లోపల మన డాక్టర్లు విధులు బాగానే నిర్వర్తిస్తున్నారే! అని ఎవరైనా అనుకుంటారు. కానీ, మరీ ఇంత వేగంగా ఎలా? అనే అనుమానమూ రాక తప్పదు. ఆ అనుమానంతోనే లోపలికి వెళ్ళి చూస్తే, దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిజం వెలుగుచూసింది. ఆ ఆసుపత్రి నుంచి రోగులందరూ క్షణాల్లోనే బయటకు రావడానికి కారణం.. అసలు అక్కడ డాక్టర్లే లేరని తెలిసింది. ఎక్కడికి వెళ్ళిపోయారని ప్రశ్నిస్తే.. ‘ఆదివారం ఆడవాళ్ళకు సెలవు’ అన్నట్టుగా డాక్టర్లందరూ సెలవు ప్రకటించుకున్నారని తెలిసింది.

మొత్తం 50 పడకలున్న ఆ ఆసుపత్రిలో కేవలం ఒక్క సిస్టర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తోంది. ఛాతినొప్పితో బాధపడుతున్న రోగి ఓవైపు.. డెలివరీ కోసం వచ్చిన మహిళ మరోవైపు.. రెండువైపులా ఈ ఇద్దరికీ చికిత్స చేయలేక ఆ సిస్టర్ పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. డాక్టర్లు లేకపోయినా, తనకు సాధ్యమైనంతవరకూ వైద్యం చేస్తోంది. పాపం.. ఈమెకు సెలవు ఉందని తెలియదో లేక డాక్టర్లు రమ్మన్నారో తెలీదు కానీ, ఒక్కతే నానా తంటాలు పడుతోంది. డాక్టర్లు లేరన్న సంగతి తెలిసి.. ఉదయం నుంచి చాలామంది రోగులు తిరిగి వెళ్ళిపోయారు.

Exit mobile version