Site icon NTV Telugu

Fire on Home: వీడేం దొంగ.. విలువైనవి దొరకలేదని ఇంటికి నిప్పు

Fire1

Fire1

దొంగలు విచిత్రంగా వుంటారు.. తమకు విలువైన వస్తువుల కోసం వెతుకుతారు. అవి దొరికితే సరి.. లేకుంటే అంతే సంగతులు.. వారిలో పిచ్చి పీక్స్ కి చేరుతుంది. తాజాగా ఓ దొంగ ఇంటికి నిప్పంటించాడు. ఎందుకంటే అతనికి విలువైనవి ఏవీ ఆ ఇంట్లో దొరక్కపోవడమే. దొంగతనం చేసేందుకు ఓ జైలు అధికారి ఇంటికి కన్నం వేశాడు ఓ దొంగ. కానీ అక్కడ విలువైన వస్తువులు దొరకకపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లకు నిప్పంటించి అక్కడినుంచి జారుకున్నాడు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైల్ సూపరింటెండెంట్ గా హనుమంతరావు విధులు నిర్వహిస్తున్నారు. హనుమంతరావు తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో గత నాలుగు రోజుల క్రితం సెలవు పెట్టి సత్తుపల్లిలోని తన క్వార్టర్స్ కి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లారు. క్వార్టర్స్ లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన ఓ గుర్తు తెలియని దొంగ సబ్ జైల్ సూపరింటెండెంట్ హనుమంతరావు క్వార్టర్స్ లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు.విలువైన వస్తువులు లభించకపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లను చిందరవందరగా పడేసి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

కిటికీలో నుండి పొగలు రావటాన్ని గమనించిన జైలు సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేసి సూపరింటెండెంట్ కు సమాచారం అందించారు. క్వార్టర్స్ కు నిప్పు పెట్టటంతో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు జైల్ వార్డెన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగతనానికి సంబంధించి వేలిముద్రలు తదితర ఆనవాళ్లు లభించకుండా తెలివిగా వస్తువులకు నిప్పంటించి దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ తరహాలో దొంగతనాలకు పాల్పడి శిక్షను అనుభవించి ఇటీవల సబ్ జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుడే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడని జైలు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత నేరగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: Sita Ramam Collection : 75 కోట్ల క్లబ్ లో ‘సీతారామం’

Exit mobile version