వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే ఈ హత్య చేసినట్లు నిర్దారించి వారిని అరెస్ట్ చేశారు.
వివరాలలోకి వెళితే.. భీమడోలు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడ్డిగూడం కూలీ పనులకు వెళ్లిన భార్య అక్కడ పనిచేసే పెంటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రోజు ఇంటి నుంచి పనికి వెళ్తున్నా అని చెప్పి ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. కొద్దిరోజులకు ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి, భర్త ప్రాణాలతో ఉంటే మనం కలవడం అసాధ్యమని తెలిపింది. దీంతో ఇద్దరు అతడిని హత్యచేయాలని ప్లాన్ వేశారు. ఇటీవల భర్తకు అనారోగ్యంగా ఉండడంతో తెలిసిన వ్యక్తిగా ప్రియుడు పెంటయ్య, ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్తను పలకరించాడు.
అక్టోబర్ 3 న హస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకురావడానికి అతనికి తోడుగా వెళ్లిన పెంటయ్య నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి, ప్రియురాలి భర్తను రాడ్డుతో కొట్టి చంపేశాడు. అనంతరం బైక్ ని కూడా ధ్వంసం చేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాడు. దెబ్బలు తనకు తగలకపోతే అనుమానమొస్తుందని పక్కనే ఉన్న గొయ్యిలో స్పృహ తప్పినట్లు నాటకమాడాడు. మొదట ఈ కేసును రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులకు భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో వారు లోతుగా ఈ కేసును విచారించగా గుట్టు బయటపడింది. ప్రియుడితో కలిసి ఉండాలని ఈ పని చేసినట్లు భార్య చెప్పగా, ప్రియురాలి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే వైఎస్ఆర్ భీమా పథకం కింద రూ. 5 లక్షలు వస్తాయని తెలియడంతో అతనిని చంపి, ఆ డబ్బుతో ప్రియురాలితో ఉండొచ్చని ఈ ప్లాన్ వేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
