Site icon NTV Telugu

భార్యపై అనుమానంతో కూతురిని బలి తీసుకున్న తండ్రి

భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వారి వైవాహిక జీవితం నూరేళ్లు సాగుతుంది. కానీ, ఇటీవల భార్యాభర్తల మధ్య నమ్మకం కన్నా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. భార్య తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంగా మారడంతో కన్నకూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. చెన్నై ప్రాంతానికి చేసిన రాధా కృష్ణన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం లావణ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. మొదట్లో సజావుగా సాగిన వీరి కాపురంలో రానురాను కలతలు మొదలయ్యాయి. దీంతో లావణ్య, పిల్లలను తీసుకొని విడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే విడిగా ఉంటున్న భార్యపై రాధా కృష్ణన్ కి అనుమానం మొలకెత్తింది. తనను కాదని వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొందేమోనని భయపడేవాడు. భార్య ఇంట్లోలేని సమయంలో కూతురు వద్దకు వెళ్లి, తన తల్లి ఎవరితో మాట్లాడుతుందో చెప్పాలని వేధించేవాడు. శనివారం రాత్రి కూడా పిల్లలను కలవడానికి లావణ్య ఇంటికి వచ్చిన రాధా కృష్ణన్, కూతురు వదనశ్రీని తల్లి గురించి ప్రశ్నించాడు. కానీ ఎనిమిదేళ్ల బాలికకు తండ్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మౌనంగా ఉండిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన రాధా కృష్ణన్ కన్న కూతురు అని కూడా చూడకుండా పక్కనే ఉన్న పదునైన ఆయుధంతో గొంతు కోసి, కడుపులో పొడిచి హతమార్చాడు.

బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు రావడం చూసి తండ్రి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఇక మరోవైపు తండ్రి రాధా కృష్ణన్ స్వయంగా వెళ్లి విల్లివాక్కం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు

Exit mobile version