NTV Telugu Site icon

Noida murder case: ఎయిర్‌లైన్ ఉద్యోగి హత్య కేసులో ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!

Delhikajalkhatri

Delhikajalkhatri

నోయిడాలో ఎయిరిండియా ఉద్యోగి సూరజ్ మాన్ (30) హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. 8 నెలల తర్వాత ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఆమె ఎవరు? ఈ హత్య వెనుక ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. నోయిడాలోని జిమ్ నుంచి సూరజ్ మాన్.. కారులోకి వచ్చి కూర్చోగానే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకు ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు.

బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు కావడం విశేషం. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో పగ ప్రతీకారాలు నడుస్తున్నాయి. తన తండ్రిని పర్వేష్ మాన్‌ చంపాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్రణాళిక వేశాడు. అంతే తన భాగస్వామి అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ఫ్లాన్ అమలు చేశాడు. ఇదిలా ఉంటే కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. సూరజ్ మాన్ హత్య తర్వాత.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు గుర్తించారు. సూరజ్ మాన్… జైల్లో ఉన్న తన సోదరుడికి ఆర్థిక సాయం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.

కాజల్ ఖత్రీ తలపై రూ.25,000 పారితోషికం ఉందని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి సంజయ్ భాటియా తెలిపారు. జనవరి 19న నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. కపిల్ మాన్ సూచన మేరకే ఇద్దరు హంతకులు సూరజ్ మాన్ చంపినట్లు తెలిపారు. జైల్లో ఉన్న కపిల్ మాన్‌.. కాజల్ ఖత్రీతో తన గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. పర్వేష్‌ మాన్‌, కపిల్‌ మాన్‌ల మధ్య శత్రుత్వం చాలా ఏళ్ల నాటిదని ఆయన అన్నారు. కపిల్ మాన్ తండ్రి హత్య వెనుక పర్వేష్ మాన్ ఉన్నాడని.. దానికి ప్రతీకారంగా కపిల్ మాన్.. పర్వేష్ సోదరుడిని చంపినట్లు చెప్పుకొచ్చారు. ఇక కాజల్ ఖత్రీ తనను తాను కపిల్ మాన్ భార్యగా పరిచయం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. కపిల్ మాన్ కూడా జైలు రికార్డులో కాజల్ ఖత్రీని భార్యగా పేర్కొన్నాడు.

Show comments