Andhra Pradesh Student Suicides: అవమాన భారం.. తల్లిదండ్రులు తిడతారనే భయం.. ఆ విద్యార్థుల ఉసురు తీశాయి. ఓ విద్యార్థి మద్యం తాగి వచ్చాడని అవమానించడంతో రైలు కింద పడ్డాడు. మరో విద్యార్థిని ట్యాబ్ దొంగిలించావని ఆరోపించడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లె ఉన్నత పాఠశాలలో సమీప గ్రామానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అతడు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. అతడి స్కూల్ బ్యాగ్‌ను ఉపాధ్యాయులు తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు కనిపిండంతో.. టీచర్స్ విషయాన్ని ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన హెడ్మాస్టర్.. ఆ విద్యార్థిని తన గదికి పిలిపించి ఆరా తీశారు. స్టూడెంట్ మద్యం తాగినట్లు అనుమానించి మందలించారు…
READ ALSO: UK Work Visa: విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాక్.. వర్క్ వీసా వ్యవధి తగ్గింపు..
అక్టోబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఐతే హెడ్‌మాస్టర్ వెంటనే తల్లిదండ్రులకు కబురు పెట్టారు. వారిని స్కూలుకు రావాలని సమాచారం ఇచ్చారు. దీంతో మద్యం తాగిన విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయం స్టూడెంట్‌ను వెంటాడింది. వెంటనే అలర్ట్ అయిన స్టూడెంట్… పాఠశాల ప్రహరీ గోడ దూకి పరారయ్యాడు. అతడి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చుట్టు పక్కల గాలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముంగిలిపట్టు సమీపంలో రైలు పట్టాలపై ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. చనిపోయింది ఆ విద్యార్థేనని నిర్ధారించారు. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు… సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. మరోవైపు మద్యం.. ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని స్ధానికులు చర్చించుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పు.. అతని ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా కుటుంబానికి తీవ్ర ఆవేదనను మిగిల్చిందని అంటున్నారు…
మరోవైపు నెల్లూరు జిల్లా కోడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూషన్‌లో దారుణం జరిగింది. ఉదయ్ కిరణ్ అనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో అనూష అనే ప్రొఫెసర్ ట్యాబ్ పోయింది. దీంతో ఉదయ్ కిరణ్.. తీశాడని ఆమె అనుమానించింది. ట్యాబ్ ఇచ్చేయాలని అందరి ముందు అడిగింది. అంతే కాదు దొంగతనం చేయడానికి సిగ్గులేదా అని మందలించింది. దీంతో ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కాలేజీ అయిపోయిన తర్వాత హస్టల్‌కు వెళ్లకుండా కళాశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు… ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతుడు ఉదయ్ కిరణ్ స్వస్థలం పోరుమామిళ్లగా పోలీసులు గుర్తించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఉదయ్ కిరణ్ చనిపోయాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు..
READ ALSO: Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
