నేటి తరం పిల్లల తీరుపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నా.. భవిష్యత్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో అర్థాంతరంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్ మంచిగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎన్నో కలలు కంటారు. వారి కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. అంతేకాకుండా పెడదారిన పడుతుంటే సన్మార్గంలో పెడుతుంటారు. ఈ పరిణామంలో కొన్ని సార్లు సీరియస్ అవుతుంటారు. ఇదంతా కేవలం ప్రేమతోనే చేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ మధ్య పిల్లలను సెల్‌ఫోన్ అనే భూతం.. పిశాచిలా వెంటాడుతోంది. ఎప్పుడు చూసినా పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారు. ఈ పరిణామం చదువుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకోసమే మొబైల్‌కు దూరంగా ఉండాలని మందలిస్తుంటారు. ఈ ఘటనే ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఫోన్‌తో ఎక్కువ సేపు ఉండొద్దని కన్నతల్లి మందలించింది. అంతే కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లిలో జరిగింది.
శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ధనుశ్రీ(20). బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఎక్కువ సేపు మొబైల్‌తోనే ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించమని తల్లి మందలించింది. అంతే ధనుశ్రీ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింంది. స్థానికులు హుటాహుటినా స్థానిక మెక్‌గాన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. అయితే పిల్లల మానసిక స్థితిపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో మెరుగైన కమ్యూనికేషన్ అవసరం అని చెబుతున్నారు.