Site icon NTV Telugu

Loan App: గోరంత ఇచ్చి కొండంత వసూలు.. ఆపై నగ్న ఫోటోలు!

Loan App Controversy

Loan App Controversy

ఈమధ్య లోన్ యాప్స్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇచ్చేది గోరంతే అయినా, పెట్టే వేధింపులు మాత్రం కొండంత! ఈ లోన్ యాప్స్ వల్ల ఎందరో లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. తాజాగా మరో లోన్ యాప్ అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. తాను తీసుకున్న దానికంటే భారీ మొత్తం చెల్లించినా.. ఇంకా అప్పు తీరలేదంటూ ఓ మహిళను మానసికంగా వేధించడమే కాదు, ఆమె నగ్న ఫోటోను వైరల్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను మనస్పర్థల కారణంగా భర్త వదిలేశాడు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో నివసిస్తోంది. ఒక హోటల్‌లో దినసరి కూలీగా పని చేస్తోన్న మౌనిక.. ఆరు నెలల క్రితం ఆన్‌లైన్‌లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ. 5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అంత మొత్తం ఇవ్వలేమన్న ఆ యాప్ యాజమాన్యం.. రూ. 2,500 ఆమె ఖాతాలో జమ చేసింది. సమయానికి డబ్బు చెల్లించలేకపోవడంతో.. యాప్‌కు సంబంధించిన వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె నుంచి ఏకంగా రూ. 70 వేల వరకు నగదు కట్టించుకున్నాడు. అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తూ వస్తున్నాడు.

అయితే.. తనకు ఆర్థిక స్థోమత లేదని, ఇంకా తాను డబ్బులు కట్టలేనని మౌనిక చెప్పింది. దీంతో, ఆమె ఫోటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి, ‘స్పీడ్‌’ యాప్‌ ద్వారా ఆమె కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ పంపాడు. ఈ విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. తీసుకున్న రెండున్నర వేలకు తాను రూ. 70 వేలు కట్టినా, ఆ దారుణానికి ఒడిగట్టారంటూ రోదించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version