NTV Telugu Site icon

Ujjain Rape Case: “నా కొడుకును ఉరేసి చంపండి”.. ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి

Ujjain Rape Case

Ujjain Rape Case

Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రవేదనతో అర్దనగ్నంగా ప్రతీ ఇంటి ముందు వెళ్లి సాయం అడిగిన వీడియో యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ దిక్కు రక్తం కారుతున్నా, 8 కిలోమీటర్లు నడిచి సాయం కోరితే, కొందరు ఇంటి ముందు నుంచి తరిమికొట్టడం అక్కడ సీసీటీవీల్లో రికార్డైంది. చివరకు ఓ గుడి పూజారి బాలికను పరిస్థితిని గుర్తించి కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన వెంటనే ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ భరత్ సోనిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ‘‘నా కొడుకును ఉరేసి చంపండి’’ అని నిందితుడు భరత్ సోని తండ్రి డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. ఈ కేసులో నిందితుడి పక్షాలన ఎవరూ వాదించవద్దని స్థానిక బార్ అసోసియేషన్ కోరింది.

Read Also: Jaishankar: మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు.. ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్ మెసేజ్..

ఇది సిగ్గుమాలిన చర్యల, నేను నా కొడుకును కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు, పోలీస్ స్టేషన్, కోర్టుకు కూడా వెళ్లను, నా కొడుకు నేరం చేశాడు కాబట్టి అతన్ని ఉరితీయాలి అని నిందితుడి తండ్రి అన్నారు. ఈ ఘటన పవిత్ర ఉజ్జయిని ప్రాంత ప్రతిష్టను దెబ్బతీసిందని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడి భరత్ సోనితో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మహిళలు కావడం పాపంగా మారిందని, మైనర్ల అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, 18 ఏళ్ల పాలనలో 58 వేల రేప్ కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.