Tamil Nadu: తమిళనాడు అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం జరిగింది. ‘‘మోక్షం’’ పేరులో ఒక ఫ్రెంచ్ మహిళను నమ్మించిన టూరిస్ట్ గైడ్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్‌కి చెందిన 46 ఏళ్ల మహిళ జనవరి 2025లో తిరువణ్ణామలైలో ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గతేడాది కొండచరియలు విరిగిపడటంతో దీపమలై కొండపైకి ప్రజలను అనుమతించడం నిషేధించారు.
Read Also: IPL 2025: పెద్ద ప్లానే.. 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్న బీసీసీఐ
అయితే, నిషేధం ఉన్నప్పటికీ, ఆమె టూరిస్ట్ గైడ్ బృందంతో కలిసి కొండపైకి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ధ్యానం చేయడానికి ఒక గుహలోకి వెళ్లిన క్రమంలో వెంకటేశన్ అనే టూరిస్ట్ గైడ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళ తప్పించుకుని కొండ దిగి తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. నిందితుడు వెంకటేశన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన అరుణాచలానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివుడి ఆలయంతో పాటు రమణ మహర్షి ఆశ్రయాన్ని సందర్శిస్తుంటారు. 14 పవిత్ర స్థలాలకు నిలయంగా తిరువణ్ణామలై ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం పలువురు విదేశీయులు ఇక్కడ కొద్ది కాలం బస చేస్తుంటారు.