AP Crime: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు.. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశారు. మిగతా అవయవాలు రికవరీ అవుతున్నప్పటికీ బ్రెయిన్ రికవరీ లేటుగా ఉంది.. బీపీ అన్నీ బాగానే ఉన్నాయని, రికవరీ అనుమానాస్పదంగా ఉందని, అది ఎలా మారుతుందో చెప్పలేమని, నేచురల్ గా రికవరీ అవ్వాలి తప్ప, ఎస్యూరెన్స్ ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేశారు. బ్రెయిన్ డామేజ్ ఎక్కువగా ఉందని, ఇంకా బ్రెయిన్ డెడ్ అవ్వలేదని తెలిపారు.
ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మెడికల్ విద్యార్థినికి మద్దతుగా బంధువులు, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని అంజలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి స్పందించాలని కోరుతున్నారు . అంజలి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ హాస్పిటల్ సూపర్వేజర్ దీపక్ ను కఠినంగా శిక్షించాలి, దీపక్ పై అత్యాచారం కేసులు నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు.. ఇక, అంజలి ఆత్మహత్యాయత్నం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు డిమాండ్ చేస్తున్నారు. అంజలికి న్యాయం చేయాలని కోరారు. అంజలి ఆత్మహత్యకు కారకుడైన కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ ఓ టీడీపీ నేత అల్లుడని, దీపక్ ను కాపాడటానికి టీడీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ కేసు విషయంలో పోలీసులు తప్పుడు రిపోర్టులు పెడుతున్నారని విమర్శించారు. అంజలి కేసులో కూటమి ప్రభుత్వం స్పందించాలని, అంజలికి సరైన న్యాయం జరగకపోతే బాధిత కుటుంబాల పక్షాన పోరాడుతామని హెచ్చరిచారు..
మరోవైపు, ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దువ్వాడ మాధవరావు దీపక్ ను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి నగరంలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎం దీపక్.. ఇదే ఆస్పత్రిలో ఫార్మాలజిస్ట్ గా పని చేస్తున్న అంజలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.. ఈ క్రమంలో అంజలి ఆత్యహత్యాయత్నం చేసుకున్నట్లు.. ఆమె ముందుగా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క బాధిత విద్యార్థిని తండ్రి, బంధువులు.. అంజలికి ఈ స్థితి రావడానికి దీపకే కారణమని బలంగా చెబుతున్నారు. ఈ క్రమంలో అంజలి తండ్రి ఫిర్యాదుతో పాటు, బయటపడ్డ.. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 రోజులుగా పరారీలో ఉన్న దీపక్ ని పోలీసులకు చిక్కడంతో.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీపక్ పై ఫిర్యాదుల ఆధారంగా పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీపక్ ను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించి, మరలా అవసరమైన మేరకు కస్టడీకి కోరి.. మరలా తదుపరి విచారణ సాగిస్తామన్నారు. ఈ కేసులో నిందితుడు అరెస్ట్ తో మిగిసిపోయిందని భావించవద్దని డీఎస్పీ భవ్య కిషోర్ స్పష్టం చేశారు.
కాగా, 9 నెలలుగా కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ లో ఫార్మలాజిస్ట్ గా నల్లపునాగ అంజలి పనిచేస్తున్నారన్నారు. అయితే.. అప్పటినుండి దీపక్ ఆమెకు దగ్గరగా ఉంటున్నట్లు తెలియ వచ్చింది.. ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ ప్రేమ పేరుతో ఆమె వెనకే తిరుగుతూ.. లైంగికంగా వేధించేవాడని.. ప్రేమించానని నమ్మించి, శారీరకంగా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. అంజలిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్న బాధతో.. ఈనెల 23న అంజలి సూసైడ్ నోట్ రాసి ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని సమాచారం ఇవ్వడంతో.. వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అంజలి రూమ్ వద్ద డైరీలో సూసైడ్ నోట్ దొరకడం వల్ల.. దీపక్ వేధింపులు బయట పడ్డాయన్నారు. ఆ సూసైడ్ నోట్ తో పాటు, ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకుని దువ్వాడ మాధవరావు దీపక్ పై వివిధ కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో.. రెండు రోజులుగా పరారీలో ఉన్న అతని కోసం గాలించి ఈరోజు పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అతనిని రిమాండ్ కు తరలించనున్నట్లు డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. అయితే. ప్రస్తుతం ఇప్పటికీ అంజలికి కిమ్స్ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు అందిస్తున్నారన్నారు. ఆమె ఇప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నట్లు తెలిపారు. వారి సొంత వైద్యుడు కూడా ఉన్నారన్నారు. అయితే.. ఇప్పటికీ ఆమె మాట్లాడే స్థితిలో లేదని డీఎస్పీ వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని, సంబంధిత ఆసుపత్రి వర్గాలకు తెలియజేస్తామని డీఎస్పీ వెల్లడించారు.