కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అలర్లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపేతర రాష్ట్రాల్లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేసిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు చేసిన కాల్పుల్లో ఒక ఆర్మీ అభ్యర్థి రాకేష్ మృతి చెందాడు. అయితే ఇప్పటికే ఈ ఆందోళనలో పాల్గొన్న కొంత మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన వెనుక ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనల్లో జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ చెందిన ఆర్మీ అభ్యర్థి గోవింద్ అజయ్ పాల్గొన్నాడు. అయితే.. గోవింద్ అజయ్ తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.. కానీ తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమో అని భయంతో ఆత్మహత్య యత్నానికి అజయ్ పాల్పడ్డాడు. దీంతో గమనించిన కుంటుంబీకులు అజయ్‌ని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అజయ్ చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం అజయ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
