Woman Killed By Brothers: పాకిస్తాన్‌లో మైనారిటీలకే కాదు, అక్కడి మహిళలకు పెద్దగా స్వాతంత్య్రం ఉండదు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా, పెద్దలకు ఎదురు చెప్పినా పరువు హత్యలు అక్కడ చాలా సాధారణం. తాజాగా కరాచీలో ఒక మహిళను సొంత సోదరులే చంపారు. మూడో పెళ్లి చేసుకోవాలనే కోరికను వెలిబుచ్చడంతో మహిళతో ఆమె సోదరులు వాగ్వాదం పెట్టుకున్నారు. చివరకు ఈ గొడవ పెద్దది కావడంతో ఆమెను హత్య చేశారు. ఈ ఘటన కరాచీలోని బహదూర్‌బాద్‌లో జరిగింది.
సదరు బాధిత మహిళకు అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి, భర్తల్ని కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూడో పెళ్లి చేసుకోవాలని భావించింది. చిన్న వివాదం పెద్దగా మారి, హత్యకు దారి తీసింది. ఘటనా స్థలం నుంచి 30 బోర్ పిస్టర్, రెండు షెల్స్ పోలీసులు రికవరీ చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Read Also: Fighter Jet J-31: పాకిస్థాన్ కు చైనా యుద్ధ విమానం..భారత్ పై కుట్రకు డ్రాగన్ ప్రయత్నం ఫలించేనా?
అంతకుముందు రోజు గుల్ టౌన్‌లో, అక్రమంగా వివాహాన్ని ముగించేందుకు ఓ మహిళ విడాకులు దాఖలు చేసింది. దీంతో సదరు మహిళ కాళ్లను ఆమె తండ్రి, బంధువులు నరికివేశారు. సోబియా బటూల్ షా అనే మహిళ, తన కుటుంబాన్ని సరిగా చూసుకోనందున తన భర్త నుంచి విడాకులు కోరినందుకు కాళ్లు నరికేసినట్లు పోలీసులు తెలిపారు.
నివేదిక ప్రకారం.. సోబియా తండ్రి సయ్యద్ ముస్తఫా షా, ఆమె బంధువులైన సయ్యద్ ఖర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్, ముస్తాక్ షా గొడ్డలితో సోబియా కాళ్లను గాయపరిచారు. సోబియాను ఆస్పత్రికి తరలించారు. తన భర్త తనను నిత్యం వేధించేవాడని, ఇద్దరు పిల్లల్ని పోషించడంలో విఫలమయ్యాడని మహిళ పోలీసులకు వెల్లడించింది. ఈ వివాహం నుంచి బయట పడేందుకు విడాకుల కోసం పిటిషన్ పెట్టుకున్నట్లు చెప్పింది.
