స్నేహితుని ఆస్తి దక్కించుకోవాలనే దురాశతో అతని కుటుంబాన్ని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూరులో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన మేడిద ప్రశాంత్, రాచర్ల పూన ప్రసాద్ స్నేహితులు. ప్రశాంత్ తన అవసరాల కోసం ప్రసాద్ వద్ద రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాతి కాలంలో ప్రసాద్ ఓ కేసులో ఇరుక్కోగా.. అతను కేసు నుంచి బయటపడేందుకు ప్రశాంత్ సహకరించాడు. ఈ సందర్భంగా ప్రసాద్ అప్పులయ్యాడు. దీంతో ప్రసాద్.. తనకు ఇవ్వాల్సిన 3.50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. మరికొంత అప్పు ఇప్పించాలని కోరాడు. ఇదే అదునుగా భావించిన ప్రశాంత్.. తాను ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నందున తన పేరుతో అప్పు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో రుణం వస్తుందని నమ్మించాడు. ఇందు కోసం ప్రసాద్ ఇంటిని తన పేరు మీదకు మార్చాలన్నాడు ప్రశాంత్..
అతని సూచన మేరకు ప్రసాద్ తన ఇంటిని.. ప్రశాంత్ పేరుపై మార్చాడు. ఆస్తి తన పేరు మీదకు మారడంతో ప్రశాంత్ మనస్సులో దురాలోచన మెదిలింది. ప్రసాద్ కుటుంబాన్ని అంతం చేస్తే ఆ ఇంటిని సొంతం చేసుకోవడంతో పాటు తాను తీసుకున్న అప్పును సైతం ఎగ్గొట్టవచ్చని ఆలోచించాడు. ఈ విషయం ప్రశాంత్.. తన తల్లికి, సోదరుడికి చెప్పగా వారు దానికి సరేనన్నారు. ప్రసాద్ కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రశాంత్, దుర్గానగర్ తండాకు చెందిన గుగులోత్ విష్ణుతో కలిసి పథకం రూపొందించాడు. వీరు మరో మైనర్ యువకుడిని సైతం పథకం అమలులో భాగస్వామ్యం చేశారు. ప్రసాద్ డబ్బుల కోసం ఒత్తిడి మరింత పెంచడంతో.. డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం నిజామాబాద్‌కు రప్పించారు. 29 నవంబర్ 2023న మాక్లూర్ మండలం మదన్ పల్లి శివారుకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఫుల్లుగా మద్యం తాగించారు. స్పృహ కోల్పోయిన ప్రసాద్‌ను హత్య చేశారు. అక్కడే పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ భార్య సాన్విక, తల్లి సుశీల, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లను నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచి ఒక్కొక్కరిని అంత మొందించేందుకు పథకం రూపొందించారు.
ప్రసాద్‌ను చంపిన రెండు రోజుల తర్వాత… అతని భార్య సాన్విక ఆలియాస్ రమణిని.. ప్రసాద్ దగ్గరకు వెళ్దామంటూ ప్రశాంత్ తన కారులో తీసుకెళ్లాడు. కారులోనే ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశాడు. శవాన్ని బాసర వద్ద ఉన్న బ్రిడ్జి పై నుంచి గోదావరి నదిలోకి తోసి వేశాడు. అనంతరం ప్రసాద్ కవల పిల్లలు చైత్రిక, చైత్రక్, సోదరీ మణులు స్వప్న, శ్రావణిలను కూడా హత్య చేశాడు. మెండోర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలను చంపాడు. ప్రసాద్ చెల్లెళ్లు డిసెంబర్ 12న కామారెడ్డి సదాశివ నగర్ ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ హత్య కేసుల్లో వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. కవలల హత్య కేసులో దోషులుగా తేలడంతో.. 8 నెలల క్రితం నిందితుడు ప్రశాంత్, అతని తల్లి ఓడ్డవ్వకు న్యాయమూర్తి యావజ్జీవ శిక్ష విధించారు. ప్రసాద్, రమణి హత్య కేసులో జిల్లా న్యాయమూర్తి ఓడ్డవ్వ, ప్రశాంత్, అతని స్నేహితుడు విష్ణుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడు ప్రశాంత్ ఆరుగురిని హత్య చేసిన తర్వాత ప్రసాద్ తల్లి సుశీలను హత్య చేయాలని కూడా ప్లాన్ చేశాడు. అయితే ఆమె లాడ్జి నుంచి తప్పించుకోవడంతో ఈ కేసులో కీలకంగా మారింది. ఆమె ఇచ్చిన సాక్ష్యంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అత్యాశకు వెళ్ళి స్నేహితుని కుటుంబాన్ని కిరాతకంగా చంపిన నిందితుని పాపం పండి ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నాడు. దోషులపై మరో రెండు కేసులు కామారెడ్డి జిల్లాలో విచారణలో ఉన్నాయి..
