Nandyal Murder Case: ఆ ఇద్దరు రౌడీ షీటర్లు.. రాక్షసుల కంటే డేంజర్. ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కొట్టి, కిడ్నాప్ చేసి.. చివరకు కత్తులతో దారుణంగా పొడిచి చంపిన దుర్మార్గులు వాళ్లిద్దరూ. వారి జీవితమంతా నేరాలే. దందాలు, సెటిల్మెంట్లు విచ్చలవిడిగా చేశారు. కానీ కత్తి పట్టిన వాడు ఆ కత్తికే బలవుతాడాని మరోసారి రుజువైంది. ఒక రౌడీ షీటర్ ప్రత్యర్ధుల చేతిలో చనిపోయాడు. మరో రౌడీ షీటర్ మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష పడి.. కటకటాలపాలయ్యాడు. దీన్నే కర్మ రిటర్న్స్ అంటున్నారు పోలీసులు.
రౌడీ షీటర్ వెంకటేశ్వర్లు కరుడు కట్టిన నేరస్తుడు. పాతికేళ్ల క్రితం నంద్యాలను గడగడలాడించాడు. అప్పట్లో అతన్ని మర్దర్ల వెంకటేశ్వర్లు అని చెప్పుకునేవారంటే.. అతను ఏ రేంజ్ రౌడీయిజం చేసేవాడో అర్ధమైపోతుంది. అతని ఆగడాలు తట్టుకోలేక అప్పటి ఎస్పీ సీతారామంజనేయులు ఎన్ కౌంటర్ చేయించారు. తండ్రి వెంకటేశ్వర్లు బాటలో కుమారుడు సాయి అలియాస్ కవ్వ ఎదిగాడు. చిన్నప్పటి నుండే సెల్ ఫోన్ల దొంగతనాలతో దందా ప్రారంభించాడు. ఆ తర్వాత బెదిరింపులు, వివాదాలకు పాల్పడేవాడు. అతనిపై హత్యాయత్నం, హత్య కేసులు ఉన్నాయి. ప్రధాన నిందితుడిగా ఉంటూ భూ వివాదాల్లో తలదూర్చేవాడు సాయి అలియాస్ కవ్వ. ఇప్పటికే సాయి కవ్వపై 18 కేసులు ఉన్నాయి.
Murder Attempt: శాడిస్ట్ మొగుడు.. అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం!
మరో రౌడీషీటర్ రాజశేఖర్ స్వస్థలం హైదరాబాద్‌లోని కాచిగూడ. నంద్యాలకు వలసవచ్చి రోజాకుంట ప్రాంతంలో వుండేవాడు. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఫోటోగ్రాఫర్ రౌడీ షీటర్ జెమిని రఘు వద్ద అసిస్టెంట్ గా చేరి పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఫోటో వీడియోలు తీయడానికి వెళ్లేవాడు రాజశేఖర్. అక్కడే వెంకట సాయి అలియాస్ కవ్వతో స్నేహం కుదిరింది. పదేళ్ల క్రితం శ్రీనివాస్ నగర్‌లో రౌడీ షీటర్లు బుక్కాపురం శివ, బాలాంజనేయులును జెమినీ బ్యాచ్ కత్తులతో పొడిచి హత్య చేసింది. ఇందులో రఘుతో పాటు రాజశేఖర్ వెంకట్ సాయి ఉన్నట్లు కేసు నమోదైంది . తర్వాత ఏడాదిన్నరకు జెమినీ రఘు హత్యకు గురయ్యాడు. తర్వాత వెంకట సాయి, రాజశేఖర్ దందా స్టార్ట్ చేశారు. ఇద్దరు కలసి హత్యలు చేయడంతోపాటు.. బెదిరింపులకు పాల్పడేవారు.
దందా చేసే క్రమంలో వెంకట సాయి, రాజశేఖర్‌కు మరో రౌడీ షీటర్ సంజీవ్‌తో పరిచయం ఏర్పడింది వీరిద్దరికీ. నాలుగేళ్ల క్రితం ముగ్గురు కలిసి మరో రౌడీషీటర్ రాజశేఖర్‌ను హత్య చేశారు. ఈ హత్య సుపారీ విషయంలో సంజీవ్‌తో వెంకట సాయి, రాజశేఖర్ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వేరువేరు గ్రూపులుగా చలామణి అవుతూ దందా చేసేవారు. మూడేళ్ల క్రితం పద్మావతి నగర్ ఆర్చ్ సమీపములోని ఓ షాప్‌లో మద్యం తాగుతూ అల్లరి చేస్తున్న వెంకట సాయి, రాజశేఖర్‌లను మందలించినందుకు హెడ్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌ను కొట్టి, ఆటోలో కిడ్నాప్ చేశారు. మహానంది చౌరాస్తాలోకి తీసుకొని వెళ్లి , కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసిన ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించింది.
Deer Meat In HYD: అంతేనేమో డాక్టర్.. చేసేదేమో గలీజ్ పని!
సురేంద్ర హత్య తర్వాత వెంకట సాయి, మరికొందరు అరెస్ట్ అయ్యారు. కానీ రాజశేఖర్ పరారయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చాక.. వెంకట సాయి మళ్లీ దందాను ప్రారంభించాడు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రధాన అనుచరుడు నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో వెంకట సాయి నిందితుడుగా ఉన్నాడు. మరోవైపు రెండేళ్లు పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపాడు రౌడీ షీటర్ రాజశేఖర్. అతడు సెల్ వాడడు. ఎవరితోనైనా మాట్లాడాలంటే వెళ్లి స్వయంగా కలిసేవాడు. లేకపోతే, వేరే వాళ్ళ సెల్ ఫోన్ నుంచి మాట్లాడేవాడు. సెల్ ఫోన్ వాడితే పోలీసులకు దొరుకుతామని ఆయనకు పోలీసుల ద్వారానే తెలిసింది. రెండేళ్ల తర్వాత, పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడనట్లు రౌడీ షీటర్ వెంకట సాయి దారుణ హత్యకు గురయ్యాడు. అయ్యలూరు ప్రాంతంలోని ఓ వెంచర్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా.. ప్రత్యర్థులు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. మరోవైపు రౌడీ షీటర్ రాజశేఖర్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఫోక్సో కేసులో అతనికి కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో.. పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ఫోక్సో కేసు కూడా విచారణలో ఉంది. సురేంద్ర హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితులు వెంకట సాయి, రాజశేఖర్ జీవితం ముగిసింది. ఇదే కర్మ రిటర్న్స్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఐతే నంద్యాలలో రౌడీ షీటర్లు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. రౌడీషీటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
