Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..

Anakapalli Death Mystery

Anakapalli Death Mystery

Anakapalli Death Mystery: అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిన తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో, మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) అనే యువకుడు చికెన్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అతను ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. షేక్ ఖాన్ గుండెపోటుతో మరణించినట్లు అతని భార్య కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఖననం చేశారు.

అయితే కుమారుడి మృతిని జీర్ణించుకోలేకపోయిన తల్లి సైదుబేబీకి ఈ ఘటనపై అనుమానాలు కలిగాయి. తన కుమారుడి మరణం వెనుక ఏదో జరిగి ఉండొచ్చని భావించిన ఆమె ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని కోరారు. తల్లి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. ఖననం చేసిన షేక్ ఖాన్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య నిపుణుల సమక్షంలో మృతదేహం నుంచి అవసరమైన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

×
×
Ad

మృతదేహం నుంచి సేకరించిన నమూనాల నివేదికలు వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తల్లి చేసిన ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగిన ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది.